బీడీ పరిశ్రమకు కరోనా దెబ్బ

బీడీ పరిశ్రమకు కరోనా దెబ్బ
  • ఉపాధి కోల్పోయిన 2.50 లక్షల కార్మికులు

బీడీలు చుడుతూ బతుకు బండిని లాగే కుటుంబాలపై ప్రత్యేక్షంగా, పరోక్షంగా కరోనా ప్రభావం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 40 కంపెనీలు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచీలుగా విస్తరించి ఉండగా, స్థానికంగా చిన్న, చిన్న పరిశ్రమలు కలుపుకొని వందల్లో ఉంటాయి. ఇందులో గుర్తింపు పొందిన 30 కంపెనీలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండగా, 10కిపైగా చిన్న పరిశ్రమలు ఉన్నాయి. తెలంగాణలోని మొత్తం పరిశ్రమల్లో7.50 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతుంటే జిల్లాలోనే 2.50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. అందులో 80 శాతం మహిళా కార్మికులే ఉన్నారు. ప్రధానంగా బీడీల మేకింగ్, ఫ్యాకింగ్, చాటన్, బట్టి కార్మికులు, టేకేదారులు, ట్రాన్స్ పోర్ట్ , మార్కెటింగ్ ఇలా వివిధ విభాగాల్లో కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నా రు.

 కార్ఖానాలు నడిస్తేనే కూలి..

బీడీ కంపెనీల యజమాన్యాలు కింది స్థాయిలో కార్ఖానాల ద్వారా కార్మికులకు పని కల్పిస్తాయి. పట్టణాలు, గ్రామాల్లో బీడీ కార్కాణాలు ఏర్పాటు చేస్తాయి. ఇందులో టేకేదారులు కార్మికులకు, ఆకు, తంబాకు ఇస్తారు. మరుసటిరోజు కార్మికులు తయారు చేసిన బీడీలను తీసుకొని కంపెనీలకు తరలిస్తారు. ఇక్కడ ఫ్యాకింగ్ చేసి ఆయా ప్రాంతాల్లో అమ్మకానికి సరుకు వెళ్తుంది. కార్మికులు బీడీలు చుట్టినందుకు గానూ వెయ్యి బీడీలకు అన్ని కలపుకొని రూ.186 ఇస్తారు. ఒక్కో కార్మికురాలు రోజుకు 500 నుంచి 1000 వరకు బీడీలు చుడతారు. నెలంతా పని దొరికితే కార్మికులకు వచ్చే సొమ్ము రూ.3,500 నుంచి రూ.5వేల వరకు ఉంటుంది. వివిధ కార్ఖానాలతో కంపెనీలు ఇప్పటికే బీడీ కార్మికులకు పని దినాలు తగించాయి. నెలలో 15 నుంచి 20 రోజులు మాత్రమే పని కల్పిస్తున్నాయి. బీడీలు తయారు చేసి వచ్చే సొమ్ముతోనే కుటుంబాన్ని పోషించేవారు ఉన్నారు. కార్ఖానాతో ఉపాధిలేక.. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కట్టడి కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. కంపెనీలు, ఇతర ఉపాధి కల్పించే సంస్థలు మూతపడ్డాయి. ఉమ్మడి నిజామాబాద్ ప్రధానంగా నిజామాద్ నగరం, ఆర్మూర్, బాల్కొండ, బీమ్ గల్, డిచ్పల్లి, బోధన్, కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, సదాశివనగర్, లింగంపేట, గాంధారి, తాడ్వాయి, బాన్సువాడ, మాచారెడ్డి తదితర ప్రాంతాల్లో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవించే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధి కోల్పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత కంపెనీ యజమాన్యాలు, ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు.