బ‌య‌టికెళ్తే క‌రోనా భ‌యం..పోకుంటే బ‌త‌క‌లేం..!

బ‌య‌టికెళ్తే క‌రోనా భ‌యం..పోకుంటే బ‌త‌క‌లేం..!

రాష్ట్రంలో 60 లక్షల ఫ్యామిలీలపై వైరస్​ ఎఫెక్ట్​
బిక్కుబిక్కు మంటున్న చిన్న ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు
సగం జీతాలే వస్తున్నా ఎంప్లాయిస్​ డ్యూటీకి వెళ్లక తప్పని పరిస్థితి
భయం భయంగా చిన్న దుకాణాల వాళ్లు
బార్బర్లు, మెకానిక్​లు, ఆటో నడిపేవాళ్లదీ ఇదే బాధ
కస్టమర్లలో ఎవరికి వైరస్​ ఉంటదో, ఎవరి నుంచి వస్తదోనన్న ఆందోళన
బుగులు పడ్తూనే పనికెళుతున్న కార్మికులు, కూలీలు
రాష్ట్రంలో వైరస్​ వ్యాప్తి పెరుగుతుండటంతో మరింత టెన్షన్

హైదరాబాద్, వెలుగు: రోజూ డ్యూటీకి పోక తప్పది, దుకాణాలు తియ్యక తప్పది.. ఇల్లు గడవాల్నంటె బతుకుబండి నడవాల్నంటె బయటికి పోక తప్పది, మందిల తిరగక తప్పది. ఇంకోదిక్కు ఏడజూసినా కరోన చుట్టుముడ్తున్నది. ఎవర్నుంచి వస్తదో, ఎట్ల అంటుతదో తెల్వని బుగులు. అయినా బిక్కుబిక్కుమనుకుంట పోతున్నరు. మూతికి మాస్కు పెట్టుకుని, శానిటైజర్​పట్టుకుని ముందుకుపడుతున్నరు. ప్రైవేటు ఎంప్లాయీస్, సొంతంగా పని చేసుకునే బార్బర్లు, మెకానిక్​లు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న దుకాణాల వాళ్లు, కార్మికులు, కూలీల బతుకు సంకటంగా మారింది. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల కుటుంబాల పరిస్థితి ఇట్లనే ఉన్నది.

మధ్య తరగతి, పేద కుటుంబాలపై కరోనా ఎఫెక్ట్​ చాలా తీవ్రంగా ఉంటోంది. బయటికిపోతే కరోనా భయం– పోకపోతే ఇల్లు గడవని పరిస్థితి. ఎక్కడ వైరస్​ బారిన పడతామో అనుకుంటూ లక్షలాది మంది ఏ రోజుకారోజు గండం అన్నట్టుగా గడుపుతున్నారు. మహారాష్ట్ర, ఇతర పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన తెలంగాణ వాళ్లు.. అక్కడి పనులన్నీ వదిలేసి సొంతూర్లకు వచ్చేస్తున్నారు. మరోవైపు సర్కారీ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు, పెన్షనర్లకూ జీతాల్లో కోత పడినా మరీ ఇబ్బంది పడటం లేదు. ఊర్లలో రైతులు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు సర్కారు ఇచ్చే సాయంపై, పెన్షన్లపై ఆధారపడి వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలో కోటీ మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయనేది సర్కారు లెక్క. ఇంకో పది, పన్నెండు లక్షల కుటుంబాలు పెరిగాయని వివిధ సంస్థల స్టడీలో వెల్లడైంది. ఈ లెక్కన రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా, ఇందులో దాదాపు 40 శాతానికిపైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ తీవ్రత తక్కువగా ఉండటంతో రైతులకు కరోనా దిగులు పెద్దగా లేదనే చెప్పాలి. మిగతా కుటుంబాలన్నింటికీ కరోనా షాక్​ తగిలింది.

చిన్న ఉద్యోగులు, కార్మికులకు తప్పని తిప్పలు

ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, సర్కారు ప్రయోజనాలు అందుకుంటున్న వారిని మినహాయిస్తే మిగతా సెక్షన్ల ప్రజలపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పనిచేస్తే తప్ప కుటుంబం గడవని ఈ సెక్షన్ల వారు ప్రమాదకర పరిస్థితుల్లోనే పనిచేయాల్సి వస్తోంది. చిన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, మార్కెట్లలో పనిచేసే వాళ్లు, స్వయం ఉపాధి, కులం పనులు చేసుకునేవాళ్లు, కన్​స్ట్రక్షన్ కార్మికులు, మెకానిక్ లు, ఇతర రంగాల్లో పనిచేస్తూ పొట్టపోసుకునే వారు కరోనా భయంతోనే నిత్యం బతుకుండి లాగాల్సి వస్తోంది. తమకు తాము ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడి నుంచి కరోనా వచ్చి పడుతుందో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు వీరిలో సగం మందికి కరోనా రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవడం కూడా తెలియదు.

ప్రైవేటు ఉద్యోగులకు గండమే!

హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్లు డ్యూటీకి వెళ్లకపోతే కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి. రాష్ట్రంలో 30 లక్షలకు మందికిపైగా ఉద్యోగులు, కార్మికులు ప్రైవేటు సెక్టార్ లో పనిచేస్తున్నారు. కరోనా పేరుతో చాలా చోట్ల సగం జీతమే ఇస్తున్నారు. అలాగని వెళ్లకపోతే మొత్తంగా ఉద్యోగాలు పోయి, రోడ్డున పడాల్సి వస్తుందనే భయం. వర్క్ ప్లేసెస్ లో శానిటైజర్లు పెట్టడం మినహా పెద్దగా రక్షణ చర్యలూ కనిపించని పరిస్థితి. కొన్నిచోట్ల ఇరుకిరుకు ఆఫీసుల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం లేదు. కుటుంబాన్ని సాదుకోవడానికి డ్యూటీలకు పోక తప్పడం లేదని ఎంప్లాయీస్​వాపోతున్నరు.

వ్యాపారులకు టెన్షన్

కరోనా ఎఫెక్ట్​ ఎంతగా ఉన్నా చిన్న, మధ్యతరహా షాపులు నిర్వహించే వ్యాపారులు దుకాణాలు తీయక తప్పని స్థితి. లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులు తమనే నమ్ముకున్న ఉద్యోగులకు సగం జీతాలైనా ఇచ్చారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా వ్యాపారాలు పెద్దగా పుంజుకోలేదు. గతంతో పోలిస్తే సగం బిజినెస్ కూడా నడవడం లేదని ఆయా వర్గాలు చెప్తున్నాయి. షాపులకు వచ్చే కస్టమర్ల నుంచి ఎక్కడ కరోనా వస్తుందోననే భయం ఉన్నా కిరాయిలు కట్టడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కోసం తప్పనిసరిగా తెరిచి ఉంచుతున్నామని అంటున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో హైరానా తప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు. షాపులకు వచ్చే వాళ్లలో కొందరు జాగ్రత్తలు పాటించడం లేదని, చెప్తే వినడం లేదని.. గిరాకీ పోతదని భరించాల్సి వస్తోందని జమ్మికుంటకు చెందిన టెక్స్ టైల్స్ వ్యాపారి సంతోష్ తెలిపారు.

ఉద్యోగులు, పెన్షనర్లు కొంత సేఫే

ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు సగం జీతం, రిటైర్డ్​ వారికి 75 శాతం వరకు పెన్షన్ వస్తుండటంతో వారి జీవనానికి పెద్దగా ఇబ్బంది లేదు. 10 లక్షలకుపైగా కుటుంబాలు పెద్దగా ఇబ్బందులు లేకుండానే బతుకుబండి నెట్టుకురాగలుతున్నాయి. సర్కారీ ఉద్యోగులున్న చోట్ల శానిటేషన్, ఇతర రక్షణ చర్యలు ఫర్వాలేదని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. ఇక వర్క్ ఫ్రం హోం చేస్తున్న రెండున్నర లక్షలకుపైగా సాఫ్ట్​వేర్ ఉద్యోగులకు దాదాపుగా పూర్తి జీతాలు అందుతున్నాయి. వారి వర్క్ స్టైల్ లో మార్పు తప్ప వైరస్ ప్రభావం అంతగా లేదని చెప్పవచ్చు. కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులకు సగం జీతమే వస్తున్నా.. వర్క్ ప్లేసుల్లో కరోనా రక్షణ చర్యలు బాగానే తీసుకుంటున్నారు. సొంత వెహికల్స్​ లేదా కంపెనీ వెహికల్స్​లో ప్రయాణిస్తుండటంతో వీరిపై వైరస్ ఇంపాక్ట్ తక్కువగానే కనిపిస్తోంది.

హైదరాబాద్ లోనే ఎక్కువ సమస్య

రాష్ట్రవ్యాప్తంగా మిగతా ప్రాంతాలతో పోలిస్తే కరోనా తీవ్రత హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 499 పాజిటివ్ కేసులొస్తే.. అందులో 95 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్​లోనే వచ్చాయి. బతుకుదెరువు కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా బయటికి రావాల్సిన 60 లక్షల కుటుంబాల్లో.. 90 శాతానికిపైగా గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలోనే బతుకుతున్నారు. వాళ్లు వైరస్​ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.
రాష్ట్రంలో వివిధ పనులు చేసే వ్యక్తులు/కుటుంబాల సంఖ్య
ప్రైవేట్ ఉద్యోగులు/ కార్మికులు 30 లక్షలు
కన్​స్ట్రక్షన్ కార్మికులు 20 లక్షలు (వీరిలో రిజిస్టర్డ్ కార్మికులు
15 లక్షల 43 వేల265 మంది)
పని మనుషులు 7 లక్షలు
లాండ్రీ కార్మికులు 5 లక్షలు
బార్బర్లు లక్ష
మెకానిక్​లు 2 లక్షలు
వలస కూలీలు 14 లక్షలు (సొంత రాష్ట్రాలకు వెళ్లిపోగా
మిగిలినవాళ్లు ఆరున్నర లక్షలు, వారిలో
3 లక్షల మందిని ప్రభుత్వం తరలించింది)
మ్యాన్యుఫ్యాక్చరింగ్
కంపెనీల్లో కార్మికులు 6 లక్షలు
కార్పెంటర్లు 5 లక్షలు
వ్యవసాయ కూలీలు 80 లక్షలు
కుక్స్ / హోటల్ వర్కర్స్ 4 లక్షలు
సెక్యూరిటీ గార్డులు లక్షా 50 వేలు
ఫుట్ వేర్ మేకర్స్ 4 లక్షలు
ఎలక్ట్రీషియన్లు లక్షా 50 వేలు
రైస్ మిల్ హమాలీలు 2 లక్షలు
డెయిరీ కార్మికులు 40 వేలు

బిజినెస్ వదిలి వచ్చేసినం

నేను ముంబైలో పాల బిజినెస్ చేస్తుండేవాడ్ని. రోజూ పొద్దున్నే ఇంటింటికి తిరిగి సప్లై చేస్తూ.. పొద్దంతా షాపులో అమ్మేవాడిని. ముంబైలో వేలలో కరోనా కేసులు రావడంతో బయట తిరుగుడు మంచిది కాదనిపించింది. అక్కడ్నే ఉంటె నాకు, మా ఇంటోళ్లకు కరోనా వస్తుందనే భయంతో పాల వ్యాపారం బంద్ చేసి నెల రోజుల కింద సొంతూరు వచ్చినం. ఇక్కడ్నే ఏదో ఒక పని చేసుకుందామనుకుంటున్నం.
– కోడి సత్యం, పెద్దముప్పారం, మహబూబాబాద్ జిల్లా
కస్టమర్లు కలుస్తలేరు

నేను ప్రైవేట్ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న. కార్పొరేట్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తుంటా. రోజూ పది, పదిహేను మంది కస్టమర్ల దగ్గరికి వెళ్లాల్సి ఉంటది. కరోనా భయం ఉన్నా.. డ్యూటీకి వెళ్లక తప్పడం లేదు. అయితే చాలా మంది కస్టమర్లు కలిసి, మాట్లాడేందుకు ఇష్టపడ్తలేరు. నా వల్ల ఎక్కడ కరోనా వస్తుందోనన్న భయం వాళ్లలో కనిపిస్తోంది. ముఖానికి మాస్కు, జేబులో హ్యాండ్ శానిటైజర్ ఉందన్న భరోసాతోనే ఉద్యోగం చేస్తున్న.- బుర్రి రమేశ్, ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి, హైదరాబాద్

ఎవరి నుంచి అంటుకుంటదో?
మాకు హోం అప్లయన్స్ షాపు ఉంది. 15 రోజుల నుంచి రెగ్యులర్ గా తెరుస్తున్నం. ఎప్పుడో ఒక కస్టమర్ వస్తున్నరు. వాళ్లు చేతులు శానిటైజర్ తో క్లీన్ చేసుకుంటున్నా.. షాపులో ఉన్న కుర్చీల్లో కూర్చుంటున్నారు. కొందరు మాస్క్ లు కూడా సరిగ్గా పెట్టుకోవడం లేదు. ఎవరి నుంచి కరోనా అంటుతదో అని భయంగా ఉంది. కానీ ఇల్లు గడవాలంటె షాపు తెరవక తప్పదు.- రమేశ్, వ్యాపారి, విద్యానగర్, హైదరాబాద్

హాస్పిటల్ అంటేనే భయపడ్తున్నరు

కరోనాతో చనిపోయిన ఓ పేషెంట్ అంతకు ముందు మా హాస్పిటల్ కు వచ్చాడు. ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అతడితో ప్రైమరీ కాంటాక్టుగా ఉన్నందుకు మేం హోం క్వారంటైన్లో ఉన్నాం. కొన్ని రోజులు హాస్పిటల్ కూడా తీయలేదు. ఇప్పుడు తెరిచినా రావడానికి జనం భయపడ్తున్నరు. – ఎన్.భరణికుమార్, ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్​మెంట్, హుజూరాబాద్

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి