
కరోనా డేంజర్ బెల్స్ మళ్లీ మోగుతున్నాయి. ఒక రెండేళ్ల పాటు జనజీవనాన్ని స్థంభింపజేసిన కోవిడ్-19 వైరస్ మరోసారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. గురువారం (మే 22) కేరళలో పాజిటివ్ కేసులు నమోదైన తర్వాత.. ఒక్క రోజులోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా పాజిటివ్ కేసులు తేలడం కలకలం రేపింది.
ఆంధ్రప్రదేశ్ కరోనా కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. వైజాగ్ లో తొలి కేసు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. విశాఖ మద్దిపాలెం పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కరోనా పాజివట్ అయినట్లు అధికారులు ప్రకటించారు. చలిజ్వరం వచ్చిందని ఆస్పత్రికి వచ్చిన మహిళకు.. టెస్టులు నిర్వహించిన డాక్టర్లు కరోనా పాజిటివ్ అని తేల్చారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో రాష్ట్రంలో కూడా పాజిటివ్ గా వచ్చిందని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సరైన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వ నిబంధలను పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, ల్యాబ్ లలో మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు నిత్యంఅందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు సహకరించి తమ ఆరోగ్యాన్ని, సమాజ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలు:
- పార్టీలు, శుభకార్యాలు, ప్రార్థన సభలు, సమావేశాలు మొదలైన గుంపులుగా ఉండే సమావేశాలకు దూరంగా ఉండాలి.
- రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్ట్స్‌లో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
- 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి.
- చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి.
- జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
- దగ్గు, జలుబు, జర్వం వంటి లక్షణాలు ఉంటే తప్పక పరీక్ష చేయించుకోవాలి.
- విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి.