కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలె

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలె

హైదరాబాద్: కరోనా చికిత్స కోసం పేదోళ్లు అన్నీ అమ్ముకుంటున్నారని వైఎస్ షర్మిల అన్నారు. పేదవాళ్లకు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉంటే 80 లక్షల కుటుంబాలకు మేలు జరిగేదన్నారు. కానీ కేసీఆర్ దొర కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చకుండా ఆయుష్మాన్ భారత్ లో చేర్చారని చెప్పారు. 

'తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధి పొందేవారి సంఖ్య కేవలం 26 లక్షలే. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఆయుష్మాన్ భారత్ వర్తించదు. కేసీఆర్ దొర గారి దృష్టిలో 26 లక్షల కుటుంబాలు మాత్రమే పేద వాళ్లు. మిగతా తెల్ల కార్డు హోల్డర్లు పేదవారిగా కనిపించడం లేదు. పేదరికంలో తేడాలు చూడటం దారుణం. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి అన్ని కుటుంబాలకు లబ్ది చేకూరేలా నిర్ణయం తీసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ తో ఏడాదికి రూ.5 లక్షల వరకు మాత్రమే బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అదే ఆరోగ్య శ్రీతో రూ.13 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. బైక్ ఉన్నా, ఫోన్ ఉన్నా ఇటుకతో కట్టిన ఇల్లు ఉన్నా ఆయుష్మాన్ భారత్ వర్తించదు. బైక్, ఫోన్, ఇల్లు ఉన్నంత మాత్రాన కోటీశ్వరులు అయిపోతారా? పాలించేవాళ్ళు మనసుతో ఆలోచించాలి' అని షర్మిల విజ్ఞప్తి చేశారు.