కరోనా వేగంగా వ్యాపిస్తోంది.. బీ అలర్ట్

 కరోనా వేగంగా వ్యాపిస్తోంది.. బీ అలర్ట్

సీఎంలతో మీటింగ్​లో ప్రధాని మోడీ 
లోకల్ కంటైన్​మెంట్​పై ఫోకస్ పెట్టండి
100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచన

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. పాత వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది.  జాగ్రత్తగా ఉండాలి. ఆందోళన చెందొద్దు. పండగ సీజన్ లో మరింత అలర్ట్ గా ఉండాలి.  కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.  ఎకానమీపై ఎఫెక్ట్ పడకుండా, ప్రజల జీవనోపాధికి ఇబ్బందుల్లేకుండా కరోనా కట్టడి వ్యూహాలను అమలు చేయాలి.  జిల్లా స్థాయిలోని అన్ని దవాఖాన్లలో అవసరమైన సౌలతులు కల్పించాలి. టెస్టుల సంఖ్య పెంచాలి.  
‑ సీఎంలతో మీటింగ్​లో  ప్రధాని నరేంద్ర మోడీ

దేశంలో కరోనా పరిస్థితిపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడిపై పలు సూచనలు చేశారు. మీటింగ్ లో కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. కాగా, మన సీఎం కేసీఆర్ మీటింగ్​లో పాల్గొనలేదు. మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్ హాజరయ్యారు.

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. పాత వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆందోళన చెందొద్దని సూచించారు. రానున్న పండగ సీజన్ లో ప్రజలు, అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఓవైపు ఒమిక్రాన్ తో పోరాడుతూనే.. రానున్న రోజుల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎకానమీపై ఎఫెక్ట్ పడకుండా, జనానికి ఇబ్బందులు తలెత్తకుండా కరోనా కట్టడి వ్యూహాలను అమలు చేయాలన్నారు. ఎక్కడికక్కడ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని, లోకల్ కంటైన్ మెంట్ పై ఫోకస్ పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలోని అన్ని దవాఖాన్లలో అవసరమైన సౌలతులు కల్పించాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని చెప్పారు. 
3 కోట్ల మంది టీనేజర్లకు టీకా 
కరోనాతో పోరులో టీకానే ఆయుధమని ప్రధాని మరోసారి చెప్పారు. వ్యాక్సినేషన్ ను స్పీడప్ చేయాలని, 100% వ్యాక్సినేషన్ ను సాధించేందుకు కృషి చేయాలని సీఎంలకు సూచించారు. దేశంలో 18 ఏండ్లకు పైబడినోళ్లలో 92 శాతం మందికి ఫస్ట్ డోస్, 70 శాతం మందికి సెకండ్ డోస్ పూర్తయిందని తెలిపారు. టీనేజర్లకు వ్యాక్సినేషన్ మొదలైన 10 రోజుల్లోనే మూడు కోట్ల మందికి టీకా వేశామని వెల్లడించారు. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, రోగాలున్న వృద్ధులకు ప్రికాషినరీ డోస్ వేస్తున్నామని చెప్పారు. ‘‘కరోనాపై ఇప్పటికే రెండేండ్లు పోరాడాం. ఇది మూడో ఏడాది. దేశ ప్రజలందరి సమష్టి కృషితో కరోనాపై తప్పకుండా విజయం సాధిస్తాం” అని ఆశాభావం వ్యక్తం చేశారు. మీటింగ్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.