పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్

పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్
  • పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు
  • బెల్జియం, హాంకాంగ్​, ఇజ్రాయెల్​లో నమోదు.. సౌతాఫ్రికాపై ట్రావెల్​ బ్యాన్​
  • బ్రిటన్​, జర్మనీ, ఫ్రాన్స్​, స్పెయిన్​, బెల్జియం, ఇటsouలీ, చెక్​ రిపబ్లిక్​ నిషేధం
  • రాష్ట్రాలను అలర్ట్​ చేసిన కేంద్రం.. టెస్టింగ్​, ట్రేసింగ్​ను పెంచాలని సూచన
  • డబ్ల్యూహెచ్​వో చెప్పకుండానే బ్యానేంటని సౌతాఫ్రికా మండిపాటు
  • ఇప్పటికిప్పుడు బ్యాన్​ వద్దన్న డబ్ల్యూహెచ్​వో అధికారి

లండన్​: ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్​ ‘బి.1.1529’ బుగులు మొదలైంది. కొత్త వేరియంట్​ ఖండాలను దాటేసి.. మరో మూడు దేశాలకూ పాకింది. వ్యాక్సిన్​ వేసుకున్నోళ్లకూ వైరస్​ అంటుతుండడంతో కొన్ని దేశాలు ఆంక్షల బాట పట్టేశాయి. చాలా దేశాల్లో ఇప్పటికే కేసులు పెరుగుతుండడం.. దానికి కొత్త వేరియంట్​ అగ్గి రాజేస్తుండడంతో అలర్ట్​ అయ్యాయి. బ్రిటన్​, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్​ రిపబ్లిక్​, ఇజ్రాయెల్​, సింగపూర్​లు సదరన్​ ఆఫ్రికా దేశాలపై ట్రావెల్​ బ్యాన్​ విధించాయి. ఎయిర్​ట్రావెల్​కు ఎమర్జెన్సీ బ్రేకులేయాలని యూరోపియన్​ యూనియన్​ చీఫ్​ ఉర్సులా వాండర్​ లీయన్​ చెప్పారు. 24 దేశాలు ఈయూ చీఫ్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. డబ్ల్యూహెచ్​వో ప్రకటనను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. ప్రస్తుతానికి మన దేశం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా.. ఆ దేశాల నుంచి వచ్చే వారిపై గట్టి నిఘా పెట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. టెస్టింగ్​, ట్రేసింగ్​పై దృష్టి పెట్టాలని, కొత్త వేరియంట్​జీనోమ్​పై ఇన్సాకాగ్​తో ఎప్పటికప్పుడు టచ్​లో ఉండాలని సూచించింది. అయితే, వచ్చే నెల రెండో వారం నుంచి ఇంటర్నేషనల్​ ఫ్లైట్లకు ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వివిధ దేశాల్లోని పరిస్థితిని బట్టి నిర్ణయంలో మార్పులు చేస్తామని తెలిపింది. కొత్త వేరియంట్​ భయాలు ప్రపంచంలోని అన్ని స్టాక్​మార్కెట్లపైనా పడింది. మన బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈతో పాటు ప్రపంచంలోని ముఖ్యమైన బెంచ్​మార్క్​ ఇండెక్స్​లన్నీ శుక్రవారం నష్టపోయాయి. దక్షిణాఫ్రికాతో పాటు దాని పక్క దేశాల్లో కొత్త వేరియంట్​లో దాదాపు 50 మ్యుటేషన్లు జరిగాయని సైంటిస్టులు గుర్తించిన సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్​పై శనివారం డబ్ల్యూహెచ్​వో సమావేశం కానుంది. ‘వేరియంట్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​’గా గుర్తించి.. ‘ఎన్​యూ’ అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 

బెల్జియం, ఇజ్రాయెల్​, హాంకాంగ్​లో కేసులు
ఇప్పటికే సౌతాఫ్రికాలో ఆరు, బోట్స్​వానాలో 3 చొప్పున కరోనా కొత్త వేరియంట్​ కేసులను గుర్తించారు. తాజాగా విదేశీ విమానాలపై నిషేధం విధించిన 24 గంటల్లోపే ఇజ్రాయెల్​లో ఫస్ట్​ బి.1.1529 వేరియంట్​ కేసు నమోదైంది. మలావి నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్​కు ఆ వైరస్  సోకినట్టు హెల్త్​ అధికారులు ప్రకటించారు. దీంతో పాటు మరో రెండు అనుమానిత కేసులను గుర్తించామని, వారిని అబ్జర్వేషన్​లో పెట్టామని చెప్పారు. ఆ ముగ్గురు కూడా ఫుల్​ డోస్​ వ్యాక్సిన్​ వేసుకున్నారని తెలిపారు. దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు రావొచ్చని ఆ దేశ ప్రధాని నఫ్తాలీ బెనెట్​ హెచ్చరించారు. కొత్త కేసులను గుర్తించేందుకు ఇజ్రాయెల్​ ప్రభుత్వం ‘ఒమెగా డ్రిల్​’ పేరిట ట్రేసింగ్​ను ముమ్మరం చేసింది. ఇటు హాంకాంగ్​లోనూ ఫస్ట్​ కేసు నమోదైంది. బెల్జియంలోనూ ఒక కేసు నమోదైంది. ఈజిప్ట్​ నుంచి వచ్చిన టూరిస్టుకు  కన్ఫర్మ్‌ అయింది. దేశంలో నైట్​పార్టీలు, క్లబ్బులపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది.  

ముందు జాగ్రత్తగా..​
ఆరు దక్షిణాఫ్రికా దేశాలను బ్రిటన్​ రెడ్ ​లిస్ట్​లో పెట్టి ట్రావెల్​ బ్యాన్​ను విధించింది.  దక్షిణాఫ్రికా, బోట్స్​వానా, లెసోథో, ఎస్వాటిని, జింబాబ్వే, నమీబియాలపై ఆంక్షలను పెట్టింది. ప్రస్తుతానికి కొత్త వేరియంట్​ కేసులు నమోదు కాలేదని బ్రిటన్​ ప్రభుత్వం స్పష్టం చేసింది. డెల్టా, డెల్లా ప్లస్​తో పోలిస్తే ఇది చాలా పవర్​ఫుల్​ అని బ్రిటన్​ హెల్త్​ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ డాక్టర్​ జెన్సీ హ్యారిస్​ చెప్పారు. దీని వ్యాప్తి, వ్యాక్సిన్​ను తట్టుకునే శక్తి, తీవ్రతపై రీసెర్చ్​ చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అన్ని వేరియంట్లపైనా తాము రీసెర్చ్​ చేస్తున్నామని, ఈ కొత్త వేరియంట్​ విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకున్నామని బ్రిటన్​ ఆరోగ్య మంత్రి సాజిద్​ వాజిద్​ చెప్పారు. బ్రిటన్​ నిషేధించిన దేశాలతో పాటు మొజాంబిక్​ నుంచి వచ్చే ప్రయాణికులపైనా బ్యాన్​ ఉంటుందని ఇటలీ, జర్మనీ ప్రకటించాయి.  ఆ 7దేశాలపై సింగపూర్​ ప్రభుత్వం ట్రావెల్​ బ్యాన్​ను విధించింది. ట్రావెల్​ బ్యాన్​ విధించడంపై సౌతాఫ్రికా ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత జనాన్ని కాపాడుకోవడం కోసం అన్ని దేశాలు తీసుకునే ముందుజాగ్రత్త చర్యలను తాము గౌరవిస్తామని, అయితే, డబ్ల్యూహెచ్​వో ఇంకా ఏదీ తేల్చకుండానే నిర్ణయం తీసేసుకోవడం దారుణమని సౌతాఫ్రికా విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. 

మార్కెట్లు కొలాప్స్​
కొత్త వేరియంట్​ భయాలతో ప్రపంచంలోని అన్ని స్టాక్​ ఎక్స్​చేంజ్​ సూచీలు పతనమయ్యాయి. హాంకాంగ్​లోని హ్యాంగ్​సెంగ్​ ఇండెక్స్​ 2.7%, జపాన్​ నిక్కీ 225.. 2.5% మేర నష్ట పోయాయి. యూరోపియన్​ యూనియన్​లోని ఎఫ్టీఎస్​ఈ100, ఫ్రాన్స్​ సీఏసీ 40, జర్మనీ డీఏఎక్స్​లు 2.5 నుంచి 3% వరకు నష్టపోయాయి. అమెరికాలోని డౌ800 పాయింట్లు (2.3%) కొలాప్స్​ అయింది. ఎస్ ​అండ్​ పీ 500 (ఐఎన్​ఎక్స్​) 1.8%, నాస్డాక్​ ఒక శాతం చొప్పున పతనమయ్యాయి. ట్రావెల్​ బ్యాన్​ నేపథ్యంలో ఎక్కువగా ఎయిర్​లైన్స్​ షేర్లు భారీగా నష్టపోయాయి. 

డబ్ల్యూహెచ్​వో మీటింగ్​
కొత్త వేరియంట్​ బి.1.1.529పై చర్చించేందుకు శనివారం డబ్ల్యూహెచ్​వో సమావేశం కానుంది. దీని గురించి తెలియాలంటే వారం పడుతుందని డబ్ల్యూహెచ్​వో అధికారి క్రిస్టియన్​ లిండ్మెయర్​ అన్నారు. మ్యుటేషన్లపై సైంటిస్టులు రీసెర్చ్​ చేస్తున్నారన్నారు. ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్టు ప్రాథమిక రీసెర్చ్​లో తేలిందని, లోతుగా రీసెర్చ్​ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి కిప్పుడు ట్రావెల్​పై ఆంక్షలు విధించడానికి బదులు.. దానిని ఆపేందుకు సైంటిఫిక్​ పద్ధతులను పాటిస్తే బాగుంటుందని ఆమె సూచించారు. శనివారం సమావేశం తర్వాత కొత్త వేరియంట్​పై తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తామని ఆమె తెలిపారు.