
భారతీయ సినిమా గమనాన్ని మార్చిన 'బాహుబలి: ది బిగినింగ్' (Baahubali: The Beginning) చిత్రం విడుదలై పదేళ్లు పూర్తయ్యాయి. ఈ పదేళ్ల మైలురాయిని పురస్కరించుకొని, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (S.S. Rajamouli) తన కలల ప్రాజెక్టును సాకారం చేసిన చిత్ర బృందంతో కలిసి ఓ అద్భుతమైన రీ-యూనియన్ (reunion) లో పాల్గొన్నారు. ఈ 'ఎపిక్ రీ-యూనియన్' కు సంబంధించిన చిత్రాలను సినిమా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో పంచుకోగా, అవి క్షణాల్లో వైరల్‌గా మారాయి. రాజమౌళి కలల ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం, ప్రభాస్ (Prabhas) కు "పాన్ ఇండియా స్టార్" హోదాను తెచ్చిపెట్టింది. జూలై 10, 2015న విడుదలైన ఈ సినిమా, 10 ఏళ్ల మైలురాయిని చేరుకోవడంతో, చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవల ఒక ప్రత్యేక వేడుకలో కలుసుకున్నారు. ఈ అపురూప కలయిక సినీ ప్రియులకు ఎనలేని ఆనందాన్నిచ్చింది.
ALSO READ : HariHaraVeeraMallu : 'హరిహర వీరమల్లు' : అమెరికాలో పవన్ క్రేజ్.. ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ రికార్డులు బద్దలు!
జ్ఞాపకాలను నెమరువేసుకున్న బాహుబలి కుటుంబం
ఈ ప్రత్యేక వేడుకలో ప్రభాస్ (Prabhas), రానా దగ్గుబాటి (Rana Daggubati), రాజమౌళి, రమ్యకృష్ణ, నాజర్, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) వంటి కీలక సభ్యులు పాల్గొన్నారు. ఈ కలయిక కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, పదేళ్ల బంధాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకునే ఓ భావోద్వేగ ఘట్టంగా నిలిచింది. చిత్ర బృందం తమ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో హృదయపూర్వకమైన సందేశాన్ని పంచుకుంది. "బాహుబలి రీ-యూనియన్ 10 సంవత్సరాలు.. ఒక కలగా మొదలై, మనలో ఎవరూ ఊహించనంత గొప్పదిగా మారింది. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన కథ... మమ్మల్ని ఒక కుటుంబంగా కలిపిన ప్రయాణం... మేము ఎప్పటికీ పదిలపరుచుకునే జ్ఞాపకాలు," అని వారు రాశారు.
కృతజ్ఞతా భావంతో బాహుబలి టీం!
"బాహుబలి 10 ఏళ్ల వేడుకను జరుపుకోవడానికి మేము కలిసినప్పుడు, ఈ కథను నమ్మిన మాకు అండగా నిలిచి ఈ రోజు ఇది ఇలా ఉండటానికి సహాయపడిన ప్రతి ఒక్కరికీ మేము కృతజ్ఞతా భావంతో నిండిపోయాం. ఈ రీ-యూనియన్ కేవలం ఒక పాత జ్ఞాపకాలను రేకెత్తించడం మాత్రమే కాదుని ఇన్ స్టాలో అభిమానులతో పంచుకున్నారు. ఒక దశాబ్దానికి పైగా ఉన్న జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది. ప్రతిదీ సవ్యంగా జరిగిన క్షణాలను, తప్పుగా జరిగి ఉండగలిగి, కానీ జరగని విషయాలన్నింటినీ మేము గుర్తు చేసుకున్నాం. ఆ క్షణాలే బాహుబలి ఈ రోజు ఇలా అవ్వడానికి కారణం," అని వారు వెల్లడించారు.
"కానీ ఈ వేడుక కేవలం మాది కాదు. బాహుబలిని తమ హృదయాల్లో నిలుపుకున్న మీ అందరిది. జ్ఞాపకాలకు, మాయాజాలానికి, మరియు నిరంతరం జీవించి ఉన్న ఈ మహాకావ్యానికి శుభాకాంక్షలు..." అని వారు మరింతగా కలిపారు. చివరగా, వారు పౌలో కోయెల్హో (Paulo Coelho) రాసిన 'ది ఆల్కెమిస్ట్' (The Alchemist) లోని ఒక కోట్‌తో ముగించారు: "మీరు ఏదైనా కోరుకున్నప్పుడు, దాన్ని సాధించడంలో మీకు సహాయం చేయడానికి విశ్వం మొత్తం కుట్ర చేస్తుంది."
అనుష్క శెట్టి, తమన్నా మిస్..
అయితే ఈ ప్రత్యేక వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. కానీ ఫిక్స్ లో అనుష్క శెట్టి, తమన్నా భాటియా కనిపించలేదు. దీంతో వారిద్దరు ఎందుకు హాజరు కాలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే అనుష్కశెట్టికి ఆహ్వానం అందింది. కానీ చివరికి హాజరు కాకూడని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తన ' ఘాటి ' చిత్రం కోసమని చర్చనడుస్తోంది. నటిగా తన పాత్ర కోసం గణనీయమైన బరువు తగ్గింది. ప్రమోషనల్ దశ ప్రారంభమయ్యే వరకు ఉద్దేశపూర్వకంగా బహిరంగ ప్రదర్శనకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరో వైపు ఈ మూవీ పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాజమౌళి 'బాహుబలి: ది ఎపిక్' ( Baahubali The Epic ) పేరుతో రెండు భాగాల చిత్రాలను కలిపి ఒకే గ్రాండ్ ప్రెజెంటేషన్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31, 2025న థియేటర్లలోకి రానుంది.