
Tag-in-Hand Blacklist: హైవేలపై ప్రయాణం చేసే వాహనదారులు తమ కార్లు, జీపులు, ట్రక్కులకు ఫాస్టాగ్ వినియోగం తప్పనిసరిగా మారిన సంగతి తెలిసిందే. గతంలో మాదిరిగా టోల్ ప్లాజాల వద్ద ఆగటం భౌతికంగా టోల్ టిక్కెట్లు కొనుక్కోవటాన్ని నివారించటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిన సంగతి తెలసిందే. ఇది టోల్ ప్లాజాల వద్ద రద్దీని, వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ వేగవంతమైన ఆటోమేటెడ్ చెల్లింపులను అందిస్తుంది. కానీ తాజాగా వీటి వినియోగం విషయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలు యూజర్లను షాక్ కి గురిచేస్తున్నాయి.
వాస్తవానికి టోల్ ప్లాజాల వద్ద సదరు వాహనం విండ్ ఫీల్డ్ అంటే ముందు అద్దానికి అతికించి ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ రీడ్ చేసి ఎలక్ట్రానిక్ పేమెంట్ చేయబడుతుంది. ఈ క్రమంలో కొందరు కారుకు ఫాస్ట్‌ట్యాగ్ అంటించకుండా చేతిలో పట్టుకుని టోల్ గేటు వద్దకు వెళ్లినప్పుడు చూపిస్తుంటారు. ఇకపై ఫాస్ట్‌ట్యాగ్ వాహనానికి అతికించకుండా చేతిలో పట్టుకుని చూపిస్తే వారి అలాంటి యూజర్లను బ్లాక్ లిస్ట్ చేయాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. అంటే మీరు ఫాస్ట్‌ట్యాగ్ వాహన అద్దానికి అతికించకుండా ఉపయోగిస్తున్నట్లయితే అది మారిన నిబంధనల కింద బ్లాక్ చేయబడుతుందని గుర్తుంచుకోండి.
కొత్త హైవే అథారిటీ నిబంధనల ప్రకారం ఎవరైనా వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్ విడిగా చూపిస్తూ వినియోగిస్తున్నట్లు గమనిస్తే.. సదరు టోల్ ప్లాజా ఏజెన్సీ దానిని రిపోర్ట్ చేసే అధికారం కలిగి ఉంటాయని వెల్లడైంది. దీంతో అలాంటి ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలను వెంటనే బ్లాక్ చేస్తారు. ఈ చర్యల ద్వారా టోల్ ప్లాజాల వద్ద చెల్లింపుల విషయంలో జరుగుతున్న అన్ని రకాల అక్రమాలను అరికట్టడంతో పాటు టోలింగ్ ప్రక్రియను వేగవంతం చేయటమే లక్ష్యంగా తెలుస్తోంది.
దీనికి ముందు ఈ నెల ప్రారంభంలో భారత ప్రభుత్వం కొన్ని హైవేలపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా 200 ట్రిప్పుల వరకు ప్రయాణం చేసేందుకు ఏడాదికి రూ.3వేలతో ఫాస్ట్‌ట్యాగ్ పాస్ తీసుకుంటే సరిపోతుందంటూ ఒక కొత్త వార్షిక ప్యాకేజీని కేంద్రం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.