దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. మే 3న ముగుస్తున్న లాక్ డౌన్ మరో రెండు వారాలు కొనసాగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దేశ వ్యాప్తంగా జిల్లాల వారీగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి కొన్ని సడలింపులతో మార్గదర్శకాలను ప్రకటించింది. రెడ్ జోన్లలోని కంటైన్మెంట్ ఏరియాల్లో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని ఆదేశించింది. గ్రీన్, రెడ్ జోన్లలో మాత్రం కొంత మేర ఆంక్షలను తగ్గిస్తూ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. కేసులు తక్కువగా ఉన్నచోట్ల పరిశ్రమలు, కంపెనీలు క్రమంగా పనిచేయడంతో పాటు పరిమిత స్థాయిలో రవాణా సౌకర్యాలను కూడా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని నిబంధనలతో జిల్లాల్లో బస్సులు, క్యాబ్స్ తిరిగే అవకాశం ఇచ్చింది. అయితే జోన్లతో సంబంధం లేకుండా దేశమంతా కొన్ని సర్వీసులు మాత్రం కోజ్ చేయాల్సిందేనని ఆదేశించింది.
దేశమంతా అన్ని జోన్స్ లో ఇవి క్లోజ్
– రైలు, విమాన ప్రయాణాలు, మెట్రో సర్వీసులు దేశమంతా బంద్.
– రాష్ట్రాల మధ్య ఎటువంటి బస్సులు తిరగడానికి లేదు.
– స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు క్లోజ్
– షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూత
– హోటళ్లు, రెస్టారెంట్లు మే 17 వరకు తెరవడానికి లేదు.
– బార్బర్ షాపులు, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ కు ఏ జోన్ లోనూ అనుమతి లేదు.
– జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్ లు క్లోజ్.
– అన్ని ప్రార్థన స్థలాలు క్లోజ్
– మత పరమైన సదస్సులు, సభలు పెట్టకూడదు.
– నాన్ ఎసెన్షియల్ సర్వీసులన్నీ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు తప్పనిసరిగా మూసేయాలి.
