కొవిడ్ ​సెంటర్​ పెట్టిన్రు.. సీటీ స్కాన్​ మరిచిన్రు!

V6 Velugu Posted on Jun 12, 2021

  •     రామకృష్ణాపూర్​ సింగరేణి ఏరియా హాస్పిటల్​లో రోగులకు ఇక్కట్లు
  •     మెషిన్​ ఏర్పాటుపై ప్రకటనకే పరిమితమైన యాజమాన్యం
  •     కొవిడ్, బ్లాక్​ ఫంగస్​ వ్యాధుల గుర్తింపులో ఇదే కీలకం
  •     ప్రైవేటు ల్యాబ్​ను ఆశ్రయిస్తున్న సింగరేణీయులు

రామకృష్ణాపూర్/మందమర్రి, వెలుగు: కార్మిక సంక్షేమానికి రూ.కోట్లలో ఖర్చు పెడ్తున్నామని, వారి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. అయితే రోగుల సమస్యను తెలుసుకోవడానికి అవసరమైన సీటీ స్కాన్​ మెషిన్​లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కరోరా విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్​రోగికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, బ్లాక్​ఫంగస్​ లక్షణాలు తెలుసుకోవడంలో సీటీ స్కాన్​కీలకం. దీంతోపాటు ఇతర ట్రీట్​మెంట్​కు కూడా ఎంతో అవసరం. ఈఎన్ టీ డాక్టరు వద్దకు వచ్చే రోగుల్లో సగం మందికి పైగా సైనస్​ సంబంధిత సమస్యలవారే. వీరిలో ఇన్​ఫెక్షన్​అంచనా వేయడానికి, రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలైతే మెదడు పరిస్థితి, శరీరంలో కణతులు గుర్తించేందుకు  సీటీ స్కాన్​ తప్పనిసరి. ఎంతో అవసరమైన ఈ మెషిన్​ను మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలనే డిమాండ్​ఏండ్లుగా ఉంది.  మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలోని బొగ్గు గనుల్లో పనిచేసే సింగరేణి ఎంప్లాయీస్, వారి కుటుంబాలకు ట్రీట్​మెంట్​పరంగా రామకృష్ణాపూర్​ ఏరియా ఆసుపత్రి కీలకం. రోజూ ఆసుపత్రికి సుమారు 1,500 మంది వస్తుంటారు.  మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని సుమారు లక్షన్నర మంది  సింగరేణీయులు, వారి కుటుంబాలు, కాంట్రాక్ట్​ కార్మికులు, రిటైర్డు ఉద్యోగులకు ఇదే ఆధారం. ఇక్కడ మెషిన్​లేకపోవడంతో రోగులను గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు మంచిర్యాల, కరీంనగర్​లోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

సీఎండీ హామీ ఏమైంది

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం రామకృష్ణాపూర్​ సింగరేణి ఏరియా ఆసుపత్రిని కొవిడ్ ​సెంటర్​గా మార్చింది. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్, క్వారంటైన్, ఐసోలేషన్​సెంటర్ సౌలత్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోవైపు  కొవిడ్​రోగికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, బ్లాక్ ఫంగస్​లక్షణాలు తెలుసుకునేందుకు అవసరమైన సీటీ స్కాన్​మెషిన్​ను సైతం రామకృష్ణాపూర్​ సింగరేణి ఏరియా ఆసుపత్రికి మంజూరు చేస్తున్నట్లు మే మొదటివారంలో సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్​ప్రకటించారు. తరచూ ఆసుపత్రిని సందర్శించే సింగరేణి డైరెక్టర్లు, గుర్తింపు సంఘం లీడర్లు సీటీ స్కాన్ మెషిన్​ త్వరలో ఏర్పాటు చేస్తారంటూ చెప్పుకొంటున్నారు. అయితే ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం ఆసుపత్రిలో సీటీ స్కాన్​కోసం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొవిడ్​ నేపథ్యంలో ఏడాదిగా స్కానింగ్​అవసరాలు బాగా పెరిగాయి. ఇప్పటికైనా హాస్పిటల్​లో మెషిన్ ​ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సింగరేణీయులు కోరుతున్నారు. 
 

Tagged suffering, Corona patients, Ramakrishnapur Singareni Area Hospital

Latest Videos

Subscribe Now

More News