బెడ్లు ఎక్కడ ఉంటే అక్కడికే కరోనా పేషెంట్లు

బెడ్లు ఎక్కడ ఉంటే అక్కడికే కరోనా పేషెంట్లు
  • - ఏ జిల్లాలో ఉన్నా పేషెంట్లను తీసుకెళుతున్న బంధువులు
  • - బులెటిన్ లలో తప్పుల తడకలా ఖాళీ బెడ్ల సమాచారం
  • - తీరా అక్కడికెళ్తే చేర్చుకోక ఇబ్బందులు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  ఈ ధాటికి ఎంతోమంది చనిపోతున్నారు. వేల మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. కొవిడ్ టెస్టు చేయించుకుని పాజిటివ్  అని తెలియగానే సామాన్యులంతా హడలెత్తి పోతున్నారు. కొన్నిచోట్ల అవగాహన లేక.. ఆలస్యంగా హాస్పిటళ్లకు పోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సామాన్యులు భయపడినట్లుగానే ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. ప్రజలకు దగ్గరలో ఎక్కడ వైద్య సౌకర్యాలు ఉన్నాయి.. ఏ తీవ్రత ఉంటే ఎక్కడ జాయిన్ కావాలి.. ఎక్కడ బెడ్లు ఖాళీగా ఉన్నాయి.. వంటి సమాచారాన్ని అందించడంలో  విఫలమయ్యాయి.  దీని వల్లనే చాలామంది ఆందోళన చెంది ఇబ్బంది పడుతున్నారు. 

జిల్లాలు దాటుకుని.. 

రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు  నాలుగు లక్షలపైనే నమోదయ్యాయి.  ఇందులో మూడున్నర లక్షల మంది రికవరీ అయ్యారు. 72 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 20 వేలకు పైగా మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్నవారి పరిస్థితి ఓ మోస్తరుగా ఉన్నా.. దవాఖానల్లో ఉన్నవారి పరిస్థితే ఆందోళనకరంగా ఉంది. ఎక్కడ బెడ్లు  ఖాళీ ఉంటే  అక్కడ అడ్మిట్ అయ్యేందుకు వెళ్తున్నారు. తమకు తెలిసిన వారి ద్వారా ఆరా తీసి.. ఎంత కిరాయి అయినా పెట్టుకుని అంబులెన్సుల మీద హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ హస్పిటళ్లకు చాలాచోట్ల నుంచి పేషెంట్లు వస్తున్నారు. 
 
ఖాళీ బెడ్ల  వివరాలేవీ?  
 
ఏ హాస్పిటల్​లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయో ప్రతి  రోజు వివరాలను ప్రకటించాలి. ప్రతి రోజు జిల్లాల్లో కలెక్టర్లు రివ్యూ చేసి.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలు చెప్పాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు.  ప్రతి రోజు స్టేట్ బులిటెన్ లో చూపిస్తున్న వివరాలకు.. ఫీల్డ్ లెవల్ ఖాళీ బెడ్ల సంఖ్యకు పొంతన ఉండటం లేదు.  ఖాళీ ఉందని పోతే  హాస్పిటల్ వారు తమ దగ్గర ఫుల్​ అయ్యాయని పేషెంట్లను వాపస్​ పంపుతున్నారు. దాంతో పేషెంట్​ను అంబులెన్సులో పెట్టుకుని వారి కుటుంబసభ్యులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. 
 
ఇప్పుడు కూడా కాసులేనా.. 

కరోనాతో రోజూ స్టేట్​లో పదుల సంఖ్యలో పేషెంట్లు  చనిపోతున్నారు. మానవత్వంతో ఆలోచించాల్సిన ప్రైవేటు ఆసుపత్రులు ఈ టైమ్ లోనూ డబ్బుల గురించే ఆలోచిస్తున్నాయి. బెడ్లు ఉన్నా బ్లాక్ చేస్తూ ఎక్కుడ డబ్బులు చెల్లించేవారిని చేర్చుకుంటున్నాయి. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు  ప్రైవేటు హాస్పిటల్స్ మీద నిఘా కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అయినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. ప్రభుత్వమే ప్రైవేట్​హాస్పిటళ్లలో ఖాళీ బెడ్ల వ్యవహారాన్ని మానిటర్​చేసి అవసరమైన వారికి కేటాయించేలా చూడాలని కోరుతున్నారు.