ఇండియాలో అర గంటకో లక్షాధికారి అవుతున్నాడు : ఎంత ఆస్తి ఉంటే మిలియనీర్స్ అంటారో తెలుసా..? తెలంగాణలోనూ స్పీడ్ అయ్యారు..!

ఇండియాలో అర గంటకో లక్షాధికారి అవుతున్నాడు : ఎంత ఆస్తి ఉంటే మిలియనీర్స్ అంటారో తెలుసా..? తెలంగాణలోనూ స్పీడ్ అయ్యారు..!

అరగంటకు ఒక మిలియనీర్ అంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇది నిజం. ఇండియాలో అరగంటకు ఒక మిలియనీర్ పుట్టుకొస్తున్నాడు. దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట మిలియనీర్ మైలు రాయిని చేరుకుంటున్నారు. ఇండియా ప్రాపర్టీ స్టోరీ గురించి మాట్లాడితే జీడీజీ, లేదా స్టార్టప్ కంపెనీల గురించే కాకుండా ఇక నుంచి మిలియనీర్ల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. బిలో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కు చేరుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. అందులో సౌత్ ఇండియాలో తెలంగాణ హాట్ స్పాట్ గా ఉండటం విశేషం. 

మెర్సిడీస్- బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్2025 ప్రకారం.. వివిధ రాష్ట్రాల GSDP (స్థూల రాష్ట్ర ఉత్పత్తి) నిష్పత్తితో పాటు మిలియనీర్ కుటుంబాలలో వస్తున్న మార్పుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో పది లక్షల సంపాదన (మిలియన్) కలిగిన వ్యక్తులు చాలా వేగంగా పుట్టుకొస్తున్నట్లు రిపోర్ట్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా జీఎస్టీ కలెక్షన్లలో మహారాష్ట్ర, ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అదే విధంగా అత్యధిక మిలియనీర్లు ఉన్న రాష్ట్రాలుగా కూడా టాప్ ప్లేస్ ఆక్రమించాయి. 

పెరుగుతున్న సంపద:

ఈ రిపోర్టు ప్రకారం తెలిసివచ్చే అంశం ఏంటంటే.. దేశంలో సంపద సృష్టి పెరుగుతుంది. అదే విధంగా ట్యాక్స్ పే చేస్తున్న కుటుంబాలు కూడా పెరుగుతున్నాయి. దేశంలో అరగంటకో మిలియనీర్ పుట్టుకొస్తుండగా.. రోజుకు 48 మంది లక్షాధికారులు అవుతున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. అయితే వెల్త్ క్రియేషన్ తో పాటు మిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ, హర్యాణా ఉండటం గమనార్హం. 

మహారాష్ట్రలో 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.7.6 లక్షల కోట్ల జీఎస్టీ కలెక్ట్ అయినట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. అంటే దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 19 శాతం కలెక్షన్లు అవుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ 18 శాతం, కర్ణాటక 9, తమిళనాడు, ఉత్తరాఖండ్ 5, గుజరాత్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలలో 5 శాతం జీఎస్టీ కలెక్ట్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (1.89%), బీహార్ (0.78%) అత్యల్పంగా కలెక్షన్లు ఉన్నాయి. ఈ జీఎస్టీ లెక్కల ఆధారంగా తెలుస్తున్నదేమిటంటే.. ఎక్కువ ఇన్ కమ్ ట్యాక్స్ ఉన్న స్టేట్స్ లో ఎక్కువ మిలియనీర్లు ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. 

మహారాష్ట్ర, ఢిల్లీలో హై పేయింగ్ జాబ్స్, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్ ఉండటంతో సంపదలో పెరుగుదల ఉందని.. అదే విధంగా కర్ణాటక, హర్యాణా రాష్ట్రాలలో ఐటీ హబ్స్ కారణంగా వెల్త్ క్రియేషన్ జరుగుతోందని తెలిపింది. మరోవైపు వ్యవసాయంపై ఆధారపడిన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలలో సంపద సృష్టి తక్కువగా ఉంటూ..మిలియనీర్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 

కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ లో పెరుగుదల:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షల 71 వేల 7 వందల మిలియనీర్లు ఉండగా.. ఇటీవలి కాలంలో కర్ణాటక, తమిళనాడు, గుజరాత్  రాష్ట్రాలలో చాలా వేగంగా మిలియనీర్లు పెరిగినట్లు రిపోర్టు పేర్కొంది. మహారాష్ట్రలో లక్షా 78 వేలకు పైగా మిలియనీర్లు ఉండగా.. ఢిల్లీలో 79 వేల 800 వరకు ఉన్నారు. 

తమిళనాడు (72,600), కర్ణాటక (68,800), గుజరాత్ (68,300) రాష్ట్రాలు చాలా వేగంగా టాప్ టెన్ లోకి దూసుకొచ్చినట్లు చెబుతున్నారు. దీనికి కారణం ఇండస్ట్రియల్, ఐటీ వృద్ధేనని స్పష్టమవుతోంది. 

 తెలంగాణ, హర్యాణాలో అత్యంత వేగంగా మార్పు:

మిలియనీర్ల ఉత్పత్తిలో తెలంగాణ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు రిపోర్టు పేర్కొంది. ఐటీ, ఫార్మా సెక్టార్ల విస్తరణ కారణంగా.. రాష్ట్రంలో 138 శాతం రికార్డు లెవల్లో మిలియనీర్లు పెరిగినట్లు తెలిపింది. GSDP ట్యాక్స్ రేషియో 6 శాతం ఉండటం గమనార్హం. 

వేగంగా పుంజుకుంటున్న రాష్ట్రాలలో హర్యాణా రెండో ప్లేస్ లో ఉంది. 98 శాతం మిలియనీర్ల వృద్ధితో తెలంగాణతో పాటు మిలియనీర్ల హాట్ స్పాట్ గా నిలిచింది. 

టాప్ లో ఉన్న సిటీలు:

సిటీల ప్రకారం చూసుకుంటే.. మిలియనీర్లలో ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉంది. లక్షా 42 వేల మంది మిలియనీర్లతో ముంబై మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూ: 68,200, బెంగళూరు: 31,600, అహ్మదాబాద్: 26,800, కోల్ కతా: 26,600, చెన్నై: 22,800, పుణె : 22,500, హైదరాబాద్ 19,800 నగరాలు ఉన్నాయి.