
- ఆ వివరాలు సమర్పించండి.. పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ పదవికి రాజీనామా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండానే ఎమ్మెల్సీగా నియమితులు కావడాన్ని సవాల్ చేసిన పిటిషన్‌పై తమకు పూర్తి వివరాలు సమర్పించాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఐఏఎస్ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారా? లేదా పదవీవిరమణ చేశారా? రాజీనామా ఆమోదానికి ప్రభుత్వానికి చేసిన వినతి పత్రం ఏమిటి వంటి? వివరాలు లేకుండా హడావుడిగా పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్నించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పి. వెంకట్రామిరెడ్డి (2006 బ్యాచ్) ఐఏఎస్ పదవికి కేంద్రం ఆమోదించకముందే ఎమ్మెల్సీగా నియమితులు కావడం, కొనసాగడం చట్టవిరుద్ధమని, అనర్హుడని ప్రకటించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి, శాసనమండలికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కరీంనగర్‌కు చెందిన జె. శంకర్ మరొకరు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ..2021 నవంబర్ 15న మెదక్ కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారని, అదే రోజు ప్రభుత్వం అంగీకరించి, 16న ఎమ్మెల్సీ నామినేషన్ సమర్పించారని తెలిపారు. రాష్ట్ర సర్కారు మాత్రమే ఆమోదించి, కేంద్రం ఆమోదించకుండానే ఎమ్మెల్సీ అయ్యారని చెప్పారు. వాస్తవానికి కేంద్రం వద్ద వెంకట్రామిరెడ్డి రాజీనామా పత్రమే లేదని పేర్కొన్నారు.
అందువల్ల వెంకట్రామి రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగడం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోర్టును కోరారు. ఈసీ తరపు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదిస్తూ.. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో వెలువరించిందన్నారు. దీని అనుగుణంగానే వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ పేపర్లను అనుమతించామని చెప్పారు. సర్వీస్ రూల్స్ ప్రకారం రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని అంగీకరించారు. పిటిషనర్ వివరణ కోసం కోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.