
మరికల్, ధన్వాడ, వెలుగు : నోటీసుల పేరుతో పల్లెగడ్డ గ్రామస్తులను వేధించడం తగదని, దేవాదాయశాఖ అధికారులు పునరాలోచించుకోవాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. శుక్రవారం మరికల్మండలం పల్లెగడ్డ గ్రామస్తులతో ఆమె మాట్లాడారు. ఏండ్ల నుంచి ఎండోమెంట్ జాగలో ఇండ్లు కట్టుకున్నామని, వాటిని కూల్చివేస్తామని అధికారులు నోటీసులు పంపించారని గ్రామస్తులు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏండ్ల తరబడి ఇక్కడే ఇండ్లు కట్టుకుని నివసిస్తుంటే ఇప్పుడు అధికారులు నోటీసులు పంపించడమేంటని ప్రశ్నించారు.
చిన్నరాజమూర్ ఆలయ భూములంటూ గ్రామస్తులను వేధిస్తే ఊరుకోమని హెచ్చరించారు. గ్రామస్తులు ఎవరూ భయపడొద్దని, మీకు అండగా నేను ఉన్నానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులకు ఆమె భూమిపూజ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, రాష్ర్ట, జిల్లా నాయకులు రతంగ్‌పాండురెడ్డి, శ్రీనివాస్, నర్సన్‌గౌడ్, తిరుపతిరెడ్డి, ఉమేశ్‌కుమార్, ఉదయభాను పాల్గొన్నారు.