
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : బస్తీ దవాఖానలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని దేశి ఇటీక్యాల బస్తీ దవాఖానను ఆయన తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రక్త పరీక్షల గది, ఇన్ పేషెంట్ వార్డు, టాయిలెట్స్, వ్యాక్సినేషన్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం నాగర్ కర్నూల్ ఆర్డీవో ఆఫీస్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు పరిశీలించారు. 2002లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఉన్న 189 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 270 కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. సాదాబైనామా అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.