
- పార్టీలో చర్చించకుండానే ఆయన సొంత నిర్ణయం తీసుకున్నారని వెల్లడి
హైదరాబాద్/భద్రాచలం, వెలుగు: ‘మేం ఆయుధాలను విడిచిపెట్టేది లేదు.. మా పోరాటం ఆగదు’అని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు. ఆయుధాలు వీడి చర్చలకు వస్తామని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి సోనూ అలియాస్ అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
సీజ్ ఫైర్ కేంద్ర కమిటీ నిర్ణయం కాదని, అభయ్ చేసిన వ్యక్తిగత ప్రకటన అని, దానితో మావోయిస్టు పార్టీకి సంబంధం లేదని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుంచో పథకాలు వేసుకొని అమలు చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ పోరాటం ఆపబోదని స్పష్టం చేశారు.