ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే ఊరుకోం..లంబాడీలపై ఢిల్లీ కేంద్రంగా కుట్రలు..లంబాడీల ఆత్మగౌరవ వేదిక

ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే ఊరుకోం..లంబాడీలపై ఢిల్లీ కేంద్రంగా కుట్రలు..లంబాడీల ఆత్మగౌరవ వేదిక

ముషీరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తే ఊరుకోబోమని లంబాడీల ఆత్మగౌరవ వేదిక హెచ్చరించింది. జాబితా నుంచి తొలగించేందుకు ఢిల్లీ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడింది. శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో కరాటే రాజు నాయక్ అధ్యక్షతన ఆత్మగౌరవ సభ నిర్వహించారు. 

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, అమర్ సింగ్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ప్రక్రియ ద్వారా లంబాడీలను 108/1976 యాక్ట్ ద్వారా ఎస్టీ జాబితాలో చేర్చారన్నారు. స్వాతంత్రం రాకముందే లంబాడీ  బంజారాలను గిరిజన తెగలుగా గుర్తించారని చెప్పారు. 

ఎస్టీ జాబితా నుంచి తమను తొలగించే కుట్రలను అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో రామచంద్రనాయక్, శరత్ నాయక్, నెహ్రూనాయక్, సంపత్ నాయక్, భీమ్రావు నాయక్, రవీందర్ నాయక్  పాల్గొన్నారు.