కరోనా, భారీ వర్షాలు ఆటో డ్రైవర్లను నట్టేట ముంచాయి

కరోనా, భారీ వర్షాలు ఆటో డ్రైవర్లను నట్టేట ముంచాయి

హైదరాబాద్ : కరోనా, భారీ వర్షాలు ఆటో డ్రైవర్లను నట్టేట ముంచాయి. కరోనా దెబ్బకి ఆటోలకు గిరాకి లేక తీవ్ర ఇబ్బందులు పడితే.. ములిగే నక్క మీద తాటికాయపడ్డట్టు భారీ వర్షాలు మరింత నష్టాల్లో పడేశాయి. ఒకవైపు ఫైనాన్సర్ల వేధింపులు, మరోవైపు కుటుంబ పోషణ భారం కావడంతో.. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గ్రేటర్ హైద్రాబాద్ లో దయనీయంగా మారిన ఆటోవాలాల స్పేషల్ రిపోర్ట్.  సిటీలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ తో గిరాకీలు లేక.. ఐదారు నెలలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆటోవాలాలు. లాక్ డౌన్ సడలింపులతో ఆటోలు రోడ్డేక్కినా.. లాభం లేకుండా పోయింది. చాలా మంది ప్రయాణికులు ఆటోల్లో కాకుండా.. సొంత వాహనాల్లోనే జర్నీ చేస్తున్నారు. దాంతో పెద్దగా గిరాకీ లేదంటున్నారు డ్రైవర్లు.  భారీ వర్షాలు, వరదలు కూడా ఆటో రిక్షాలపై తీవ్ర ప్రభావం చూపింది.

నగరంలో వారం పదిరోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు.. లోతట్టు ప్రాంతాల్లోని వందల ఆటోలు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో కొట్టుకుపోయిన ఆటోలను క్లైమ్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఆటోలతో సహా బండిలో ఉన్నపేపర్లు కూడా వరదలోనే కొట్టుకెళ్లాయని అంటున్నారు. సిటీలో మూడువేలకు పైగా ఆటోలు నీట మునిగి పాడయినట్టు అంచనా. ఇక సిటీలో గుంతల రోడ్లు కూడా ఆటోలకు ఇబ్బందికరంగా మారాయి. చాలామటకు రిపేర్లకొచ్చాయని.. బాగుచెయించాలంటే వేలల్లో ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆటోవాలాలకు ఫైనాన్స్ వేధింపులు, కుటుంబ పోషణ భారమవుతోంది. కరోనా కంటే ముందు వరకూ… రోజూ వెయ్యి, 1200 సంపాదిస్తే.. ఇప్పుడు రెండు మూడొందలు కూడా రావడం లేదంటున్నారు. చాలా వరకు గిరాకీలు తగ్గాయని చెబుతున్నారు. ఆటోలను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం తమను పట్టించుకోలేదంటున్నారు ఆటో వాలాలు. ఏపీ సర్కార్ ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది పది వేల రూపాయలను ఇస్తున్నట్లు గుర్తు చేస్తున్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అటు కరోనా.. ఇటు వానలు వరదలు.. నిండా ముంచాయంటున్నారు ఆటో వాలాలు. ప్రభుత్వం ఆదుకొని అండగా ఉండాలని కోరుతున్నారు.