V6 News

55 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు.. ఒక్క రోజులో ల‌క్షా 90 వేల‌ టెస్టులు

55 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు.. ఒక్క రోజులో ల‌క్షా 90 వేల‌ టెస్టులు

దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 13,925 మంది పేషెంట్లు క‌రోనాను జ‌యించార‌ని, దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,27,755కి చేరింద‌ని వెల్ల‌డించింది. దేశంలో మొత్తం 4,10,461 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. ప్ర‌స్తుతం 1,69,451 మంది మాత్ర‌మే ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని చెప్పింది. క‌రోనా నుంచి రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య ప్రస్తుత యాక్టివ్ కేసుల క‌న్నా 58 వేలు ఎక్కువ‌గా ఉంద‌‌ని, క‌రోనా రిక‌వ‌రీ రేటు 55.49 శాతానికి పెరిగింద‌ని కేంద్రం వెల్ల‌డించింది. మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం టెస్టింగ్ కెపాసిటీని మ‌రింత పెంచుతున్న‌ట్లు తెలిపింది. దేశంలో ప్రస్తుతం 981 క‌రోనా ల్యాబ్స్ ప‌ని చేస్తున్న‌ట్లు పేర్కొంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ల‌క్షా 90 వేల శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్లు తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 68,07,226 క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని కేంద్రం వెల్ల‌డించింది.