దేశంలో 52 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో 52 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 52.47 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 10,215 మంది పేషెంట్లు క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస‌ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,43,091 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. వారిలో 1,80,012 మంది ఈ వైర‌స్‌ను జ‌యించార‌ని పేర్కొంది. క‌రోనా పేషెంట్ల‌ రిక‌వ‌రీ రేటు క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంద‌ని, ప్ర‌స్తుతం ఆస్ప‌త్రుల్లో 1,53,178 మంది వేర్వేరు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో భార‌త్ స‌రైన స‌మ‌యంలో వేగంగా నిర్ణ‌యాలు తీసుకుందని, ముంద‌స్తుగా లాక్‌డౌన్ విధించ‌డంతో వైర‌స్ వ్యాప్తి వేగాన్ని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని కేంద్రం తెలిపింది. ఈ స‌మ‌యంలో ఆస్ప‌త్రుల్లో వ‌సతుల కల్ప‌న‌తో పాటు టెస్టింగ్ కెపాసిటీని వేగంగా పెంచుకున్న‌ట్లు చెప్పింది. ప్ర‌స్తుతం దేశంలో 907 ల్యాబ్స్‌లో క‌రోనా టెస్టులు జ‌రుగుతున్నాయ‌ని, రోజుకు మూడు ల‌క్ష‌ల శాంపిల్స్ టెస్టు చేయ‌గ‌లిగే సామ‌ర్థ్యం పెంచుకున్నామ‌ని వెల్ల‌డించింది. అయితే గ‌డిచిన 24 గంట‌ల్లో 1,54,935 మందికి టెస్టులు చేశామ‌ని భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 59,21,069 శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్లు చెప్పింది.