బెంగాల్‌లో కరోనా నిబంధనలు జూన్‌ 15 వరకు పొడిగింపు

బెంగాల్‌లో కరోనా నిబంధనలు జూన్‌ 15 వరకు పొడిగింపు

 బెంగాల్ లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతూనే ఉన్నాయి. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మే నెల 15 నుంచి లాక్ డౌన్ తరహా నిబంధనలు విధించారు. వైరస్ వ్యాప్తి కంట్రోల్ కాక పోవడంతో ఆ నిబంధనలు.. జూన్‌ 15 వరకు అమలులో ఉండనున్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా వైరస్ వ్యాప్తి తగ్గిందన్నారు సీఎం మమతా బెనర్జీ.

తాజా నిర్ణయంతో.. జూన్‌ 15 వరకు రాష్ట్రంలోని ఆఫీసులు, విద్యాసంస్థలు మూసివేయనున్నట్లు మమతా ప్రభుత్వం తెలిపింది. మెట్రోతో సహా రవాణా సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది. కేవలం అత్యవసర సేవలకు, హోమ్‌ డెలివరీలు, ఇతర ఆన్‌లైన్‌ సేవలకు మాత్రమే అనుమతించింది. నితావ్యసర సరుకులకు సంబంధించిన షాపులు ఉదయం 7 నుంచి ఉదయం 10 గంటల వరకు.. స్వీట్‌ షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు తెరచి ఉంటాయి. ఇక పెట్రోల్‌ పంప్స్‌, బ్యాంక్స్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకే పరిమితి ఉంది. అయితే సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన వంటి కార్యక్రమాలకు అనుమతి లేదు. వివాహ వేడుకల్లో అతిథులకు కూడా గరిష్టంగా 50 మంది వరకు మాత్రమే పాల్గొనే విధంగా పరిమితి విధించింది. ఇక షాపింగ్‌ కాంప్లెక్స్‌, బ్యూటీ పార్లర్స్‌, సినిమా హాల్స్‌ రెస్టారెంట్లు వాటికి అనుమతి లేదు.