ఏడు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు

ఏడు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు
  • జార్ఖండ్, మిజోరంలో లాక్​డౌన్ 
  • యూపీలో వీకెండ్​లో అమలు  
  • జమ్మూకాశ్మీర్​లో నైట్ కర్ఫ్యూ
  • ఉత్తరాఖండ్​, కర్నాటకలో కూడా..

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. వైరస్ కట్టడికి నైట్ కర్ఫ్యూ పెడుతున్నాయి. నైట్ కర్ఫ్యూ విధించిన కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ ప్రభుత్వం 8 రోజుల పాటు లాక్​డౌన్ విధించింది. యూపీ​లో వీకెండ్ లాక్​డౌన్ విధించను న్నట్లు అక్కడి సర్కారు ప్రకటించింది. మిజోరంలోని జిల్లా కేంద్రాల్లో లాక్​డౌన్ అమలవుతోంది.

జార్ఖండ్ లో 8 రోజులు..  
జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఈ నెల 22 నుంచి 29 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని సీఎం హేమంత్ సోరేన్ మంగళవారం ప్రకటించారు. 

యూపీలో వీకెండ్ లాక్ డౌన్ 
వీకెండ్ లాక్​డౌన్ విధించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే నైట్​ కర్ఫ్యూ అమలులో ఉండగా.. శని, ఆదివారాల్లో రాష్ట్రమంతా పూర్తి షట్​డౌన్​లో ఉంటుందని తెలిపింది.

మిజోరంలో 10 జిల్లా కేంద్రాల్లో.. 
ఐజ్వాల్ సహా 10 జిల్లా కేంద్రాల్లో మిజోరం ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. ఈ నెల 26 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తామని స్పష్టం చేసింది.

కర్నాటకలో వీకెండ్ లాక్‌‌డౌన్‌‌
కర్నాటక ప్రభుత్వం వీకెండ్స్‌‌లో కంప్లీట్ లాక్‌‌డౌన్‌‌ అమలవుతుందని ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు నైట్‌‌ కర్ఫ్యూ కూడా ఉంటుందని స్పష్టం చేసింది. 

ఉత్తరాఖండ్‌‌లో నైట్ కర్ఫ్యూ
ఉత్తరాఖండ్ సర్కారు ఏప్రిల్ 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం 7 గంటల నుంచి ఉదయం 5 వరకు ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది.


చండీగఢ్‌‌లో వీకెండ్ లాక్‌‌డౌన్‌‌
చండీగఢ్‌‌లో శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 5 వరకు వీకెండ్ లాక్‌‌డౌన్‌‌ పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బుధవారం ఒక్కరోజు కంప్లీట్ లాక్‌‌డౌన్‌‌ విధించింది.

జమ్మూలో కర్ఫ్యూ పొడిగింపు.. 
జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను పొడిగించింది. ఇప్పటి వరకు 8 జిల్లాల్లో అమల్లో ఉండగా, ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎల్జీ ఆఫీస్ మంగళవారం ప్రకటించింది. ‘‘అన్ని మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లో రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది” అని పేర్కొంది.

మహారాష్ట్రలో కిరాణా షాపులు 4 గంటలే
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మరింత కఠినం చేసింది. కిరాణా దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11 వరకే తెరిచి ఉంచాలని ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలు మంగళవారం నుంచి మే 1 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. అన్ని కిరాణా షాపులు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, డెయిరీలు, బేకరీలు, వెజ్, నాన్​వెజ్ మార్కెట్లు, వ్యవసాయ పనిముట్లు, ఉత్పత్తులకు సంబంధించిన అన్ని దుకాణాలు 4 గంటల పాటే తెరిచి ఉంచాలని ఆదేశించింది.