మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌

మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌
  • ప్రజలు రూల్స్‌ పాటించట్లేదు
  • సర్కారు టెస్టులు ఎక్కువ చేయట్లేదు
  • మళ్లీ గత ఏడాది ఆగస్టు స్థాయిలో టెస్టులు, ట్రేసింగ్‌ జరగాలి
  • మహారాష్ట్ర సీఎంకు కేంద్రం లేఖ‌
  • గుజరాత్‌లో 4 , మధ్యప్రదేశ్‌లో 2 సిటీల్లో నైట్‌ కర్ఫ్యూ
  • ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ ఠాక్రేకు కేంద్ర ప్రభుత్వం లెటర్‌‌

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ మొదలైందని కేంద్రం ప్రకటించింది. ప్రజలు కరోనా రూల్స్‌‌ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయంది. పరీక్షలు చేయడం, కాంటాక్ట్‌‌ కేసులను గుర్తించడం, క్వారంటైన్‌‌ చేయడం కూడా అంతంతమాత్రంగానే జరుగుతోందని చెప్పింది. వైరస్‌‌ వ్యాప్తిపై జిల్లా యంత్రాంగాల్లో ఆందోళన కనిపించట్లేదని, ఇప్పటికే చాలా చేశామని అధికారులు అనుకుంటున్నారని తెలిపింది. మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర బృందం గత వారం రాష్ట్రంలో పర్యటించింది. ఆ టీమ్‌‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హెల్త్‌‌ సెక్రటరీ రాజేశ్‌‌ భూషణ్ ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ థాక్రేకు తాజాగా లెటర్‌‌ రాశారు.

కర్ఫ్యూలు, లాక్‌‌డౌన్‌‌లతో ఆగట్లేదు

ముంబైలో టెస్టు చేస్తున్న వారిలో 5.1 శాతం మందికి పాజిటివ్‌‌ తేలుతోందని, ఔరంగాబాద్‌‌లో ఇది 30 శాతం ఉందని భూషన్‌‌ చెప్పారు. ఆయా ప్రాంతాల్లో కమ్యూనిటీలో వ్యాప్తి రేటు ఎక్కువున్నట్టు తెలుస్తోందన్నారు. కాంటాక్ట్‌‌ ట్రేసింగ్‌‌ తక్కువగా చేయడం.. అసింప్టమాటిక్‌‌, ప్రీ సింప్టమాటిక్‌‌ కేసులను గుర్తించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో నైట్‌‌ కర్ఫ్యూ, వారాంతపు లాక్‌‌డౌన్లు పెడుతున్నారని.. వాటి వల్ల వైరస్‌‌ వ్యాప్తి తగ్గట్లేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కిందటి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌‌ స్థాయిలో టెస్టులు, ట్రేసింగ్‌‌ చేయాలని సూచించారు.

ముంబైలో రోజూ లక్ష మందికి వ్యాక్సిన్‌‌ టార్గెట్‌‌

దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో యాక్టివ్‌‌ కేసులు కూడా లక్షపైనే ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లలో కెపాసిటీని సగానికి తగ్గించింది. శుభాకార్యాలకు పరిమిత సంఖ్యలో హాజరవ్వాలని, ఆఫీసులు తమ ఉద్యోగులకు వర్క్‌‌ ఫ్రం హోం కల్పించాలని సూచించింది.మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో ముంబై సిటీలో వ్యాక్సినేషన్‌‌ డ్రైవ్‌‌ వేగం పెంచాలని ముంబై మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ నిర్ణయించింది. రోజూ లక్ష మందికి వ్యాక్సిన్‌‌ వేయాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. ప్రస్తుతం రోజూ 40 వేల నుంచి 45 వేల మందికి వ్యాక్సిన్‌‌ ఇస్తున్నారు.

వరుసగా ఆరో రోజూ 20 వేల పైనే

దేశంలో గత 24 గంటల్లో 24,492 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 6 రోజులుగా 20 వేలకు పైనే కేసులు నమోదవుతున్నాయంది. దేశంలో ఇప్పటివరకు 1.14 కోట్ల కేసులు నమోదయ్యాయని తెలిపింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, పంజాబ్‌‌, కర్నాటక, గుజరాత్‌‌లలోనే 80 శాతం ఉన్నాయంది. 24,492 కేసుల్లో 15,051 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే రికార్డయ్యాయంది. గత 24 గంటల్లో 131 మంది మరణించారని, దీంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 58 వేలకు చేరుకుందని చెప్పింది.

ఒక్కరోజే 30 లక్షల మందికి వ్యాక్సిన్‌‌

దేశంలో సోమవారం 30 లక్షల మందికి వ్యాక్సిన్‌‌ వేశారు. ఒక్క రోజులో ఇంతమందికి టీకా వేయడం ఇదే తొలిసారని కేంద్రం వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్‌‌ వేసిన వారి సంఖ్య 3.29 కోట్లకు చేరుకుందని తెలిపింది. గత 15 రోజుల్లో 60 ఏళ్ల పైబడిన కోటి మందికి వ్యాక్సిన్‌‌ వేశామంది.

గుజరాత్‌‌, మధ్యప్రదేశ్‌‌లలో నైట్‌‌ కర్ఫ్యూ

గుజరాత్‌‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అహ్మదాబాద్‌‌, వడోద‌‌ర‌‌, సూర‌‌త్‌‌, రాజ్‌‌కోట్‌‌‌‌లలో నైట్‌‌ క‌‌ర్ఫ్యూను మరో రెండు గంటలు పొడిగించారు. రోజూ రాత్రి 10 గంట‌‌ల నుంచి ఉద‌‌యం 6 గంట‌‌ల వ‌‌ర‌‌కు క‌‌ర్ఫ్యూ అమల్లో ఉంటుందని అక్కడి సర్కారు వెల్లడించింది. మార్చి 17 నుంచి 31 వ‌‌ర‌‌కు ఈ నైట్ క‌‌ర్ఫ్యూ కొన‌‌సాగుతుంద‌‌ని తెలిపింది. మధ్యప్రదేశ్‌‌లోనూ భోపాల్, ఇండోర్‌‌ సిటీల్లో బుధవారం నుంచి నైట్‌‌ కర్ఫ్యూ విధిస్తున్న ట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరో 8 నగరాల్లో రాత్రి 10 కల్లా షాపులను క్లోజ్ చేయాలని అధికారులను ఆదేశించింది.