
లాక్‌డౌన్ ముందుదాకా ఆ చిన్న ఊరు, అక్కడున్న ఆ షాప్ పేరు ఎవరికీ తెలియదు. కానీ, కరోనా దెబ్బకి ఇప్పుడు ఆ షాప్ పేరు ప్రపంచం మొత్తం రీచ్ అయ్యింది. విశేషం ఏంటంటే.. ఆంక్షల్ని పట్టించుకోకుండా రిస్క్ చేసి మరీ ఈ షాప్ ముందు సెల్ఫీలు దిగి షేర్ చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఆ బట్టల షాప్ పేరేంటో తెలుసా? ‘కరోనా’. కేరళలోని మువట్టుప్పుజాలో ఉందీ ‘కరోనా టెక్స్‌టైల్స్ & రెడీమేడ్స్’ స్టోర్. పరీద్ అనే వ్యక్తి ఇరవై ఏడేళ్ల క్రితం ఈ స్టోర్‌ను ప్రారంభించాడు. అంతేకాదు అతన్ని చుట్టుపక్కల వాళ్లంతా కరోనా పరీద్ అనే పిలుస్తారట. ఈ షాప్ కోసం ఎన్నో పేర్లు తిరగేశాడట ఆయన. డిక్షనరీలో కరోనాకి నానార్థాలు కనిపించాయట. అందులో సూర్యుడు కూడా ఉండటంతో ఆ పేరునే పెట్టానని చెప్తున్నాడు పరీద్. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఆపేరు ఆయనకు ఏ రకంగా ఇప్పుడు ఉపయోగపడే పరిస్థితి లేదు. సెల్ఫీల కోసం కొందరు యువకులు రిస్క్ చేసి ఇక్కడికి వస్తుంటే… పోలీసులు వాళ్లకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ కావడంతో విదేశీయులు కూడా ఈ షాప్ వివరాల కోసం తెగ వెతుకుతున్నారట. ఈ పరిస్థితులు చల్లబడ్డాకైనా తన షాప్ దగ్గర ‘క్యూ’ కడతారేమోనని గంపెడు ఆశలతో ఉన్నాడు పరీద్.