కరోనా టెన్షన్‍.. రద్దీగా వేములవాడ, కొండగట్టు ఆలయాలు

కరోనా టెన్షన్‍.. రద్దీగా వేములవాడ, కొండగట్టు ఆలయాలు

వరంగల్, వెలుగు: రాష్ట్రంలో ఓ దిక్కు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇదే టైంలో జాతరలు, పండుగల సీజన్​వచ్చేసింది. నాలుగు రోజుల్లో సంక్రాంతి రాబోతోంది. ఈ నెలలోనే చాలా జాతరలు స్టార్ట్ కాబోతున్నాయి. ఉమ్మడి వరంగల్‍ జిల్లా పరిధిలో వచ్చే నెలలో మేడారం మహా జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆఫీసర్లు టెన్షన్​ పడుతున్నారు. ఇప్పటికే కేసులు పెరుగుతుండగా పండుగలు, జాతరల వల్ల మరింత ఎక్కువయ్యే అవకాశాలుంటాయని టెన్షన్​ పడుతున్నారు. అవసరమైతే తప్పితే జాతరలకు రావొద్దని, పండుగలను కూడా ఇంట్లోనే చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో భక్తులు కూడా జాతరలకు వెళ్లి రిస్క్​లో పడడం ఎందుకని ఆలోచనలో పడ్డారు. 

 జన‘వర్రీ’ 

ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో ఐనవోలు, గట్టు మల్లన్న జాతర్ల సందర్భంగా బోనాలు స్టార్టవుతాయి. వారం పాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఇవేగాక వీరభద్రుని టెంపుల్స్​అయిన కొత్తకొండ వీరన్న, కురవి జాతరలు కూడా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి, ఆదిలాబాద్‍ జిల్లాలో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా ఇదే నెలలో ప్రారంభం కానుంది. ఈ జాతరలకు వెళ్లే ముందు రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి కాబట్టి జనాలు వేములవాడ పయనమవుతున్నారు. కొండగట్టు అంజన్న టెంపుల్​కు కూడా క్యూ కడుతుండడంతో రద్దీ పెరిగింది. 

‘మేడారం’  ఏం జేసుడు?  

దేశంలో రెండేండ్లకోసారి నిర్వహించుకునే మేడారం జాతరకు ఇప్పటినుంచే భక్తులు వెళ్లి వస్తున్నారు. ఈ సంఖ్య లక్షలకు చేరే చాన్స్​ ఉండడంతో వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే జాతర ప్రభుత్వానికి సవాల్‍ గా మారనుంది. ఇప్పటికే ఆర్టీసీ హన్మకొండ బస్టాండ్‍ నుంచి స్పెషల్‍ బస్సులు స్టార్ట్ చేయడంతో హాలీడేస్‍, వీకెండ్స్​లో ఫుల్లు రష్​ ఉంటోంది. రాను రాను భక్తుల తాకిడి పెరుగుతుండడంతో ఏం చేయాలా అని ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. లక్షల మంది భక్తులను ఎలా కంట్రోల్​ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి జాతరల్లో మాస్క్​ పెట్టుకునేలా చేయడం, ముఖ్యంగా ఫిజికల్​ డిస్టెన్స్​ మెయింటెయిన్​చేయించడం వీలు కాని పని. దీంతో మొక్కులు ఉంటేనే మేడారం వెళ్లాలని, పిల్లలను తీసుకెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు. వెళ్లినా టెంట్లు వేసుకొని ఉం డకుండా దండం పెట్టుకుని రావాలని కోరుతున్నారు. 

 వరంగల్​లో ఒమిక్రాన్ భయం  

ఉమ్మడి జిల్లా వరంగల్​లో కరోనాతో పాటు ఒమిక్రాన్‍ కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. హనుమకొండ, వరంగల్‍ జిల్లాల పరిధిలో ఇప్పటికే ఒక్కొక్క ఒమిక్రాన్‍ కేసు నమోదవగా, వరంగల్ ఎన్ఐటీలో 13 మందికి కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. కాకతీయ మెడికల్‍ కాలేజీలో ఫస్ట్​ 26 మందికి, ఆపై కాలేజీ ప్రిన్సిపాల్‍ తో పాటు మంగళవారం మరో 15 మందికి వైరస్​సోకింది. వరంగల్‍తో పాటు చుట్టుపక్క 10 జిల్లాలకు సర్వీస్‍ ఇచ్చే ఎంజీంలోనూ అంతేస్థాయిలో కొవిడ్​ పేషెంట్ల అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది.  

కరోనా కేసులు ఇట్లున్నయ్​

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గత మంగళవారం 1052, బుధవారం 1520 కేసులు వస్తే, గురువారం ఏకంగా 1913 కేసులు, శుక్రవారం 1920 కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్ ఫస్ట్ వీక్ తర్వాత, కేసుల సంఖ్య 1900 దాటడం ఇదే తొలిసారి . ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 16,496 యాక్టివ్​కేసులున్నాయి.  

వేములవాడ, ధర్మపురిల్లో వైకుంఠ దర్శనం రద్దు 

ధర్మపురి, వేములవాడ : కొవిడ్ ​కేసులు పెరుగుతున్నందున ఈ నెల 13న  ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులకు ఉత్తర ద్వారా దర్శనం ఆపేస్తున్నట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు . ఆ రోజు అన్ని కార్యక్రమాలు కొద్దిమంది అర్చకులతో ఇంటర్నల్​గా నిర్వహిస్తామన్నారు. అలాగే వేములవాడ రాజన్న ఆలయంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను కూడా అంతర్గతంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ఆఫీసర్లు చెప్పారు. ఆ రోజు టెంపుల్​కు భక్తులు ఎవరూ రావొద్దని కోరారు.  ఇప్పటికే భద్రాచలంలోనూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, తెప్పోత్సవం, రాపత్​సేవలు రద్దు చేశారు. 

మేడారంలో క్యాంపులు, ఫీవర్ సర్వే

మేడారం జాతరకు లక్షల మంది భక్తులు వస్తారు. ఇప్పటికే రష్ ​మొదలైంది. ఇది మాకు కొంతవరకు ఛాలెంజ్‍ లాంటిదే. డిసెంబర్‍ 8 నుంచే క్యాంపులు స్టార్ట్ ​చేశాం. జనాలకు మైకుల ద్వారా అవేర్​నెస్​ కల్పిస్తున్నాం.  ప్రతి బుధ, ఆదివారాల్లో స్పెషల్ ​క్యాంపులు పెట్టి కొవిడ్‍ వ్యాక్సిన్‍ ఇస్తున్నాం. మేడారం మొత్తం ఫీవర్ సర్వే చేస్తున్నాం. రద్దీ మరింత పెరిగాక జాతర చుట్టూరా ఉండే గ్రామాల్లో మెడికల్‍ క్యాంపులు కూడా పెడతాం.  
– అల్లెం అప్పయ్య, డీఎంహెచ్‍ఓ , ములుగు