జిల్లాలో రోజుకు కనీసం 50 మందికి టెస్టులు

జిల్లాలో రోజుకు కనీసం 50 మందికి టెస్టులు

హైదరాబాద్‌‌, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లోనూ కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో జిల్లాలో రోజుకు కనీసం 50 మందికి టెస్టు చేయించాలని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ల (డీఎంహెచ్ వో)లను పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు శనివారం ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా, ర్యాండమ్‌‌గా శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయనున్నారు. వైరస్ వ్యాప్తిని తెలుసుకునేందుకు ప్రతి జిల్లాలో వారానికి కనీసం 200 మందికి టెస్ట్ చేయించాలని ఇటీవల ఐసీఎంఆర్ గైడ్‌‌లైన్స్ జారీ చేసింది. రెగ్యులర్ టెస్టులతో సంబంధం లేకుండా… హెల్త్ వర్కర్లు, పోలీసులు, హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్లు, గర్భిణులు, పారిశుధ్య కార్మికులు తదితరులకు ర్యాండమ్‌‌గా టెస్టులు చేయించాలని సూచించింది. మరోవైపు జిల్లాల్లోనూ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రోజుకు కనీసం 50 టెస్టులైనా చేయించాలని సర్కార్ నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.

సర్కార్ టెస్టింగ్ కెపాసిటీ రెండు వేలే..

ప్రస్తుతం రాష్ర్టంలో 10 గవర్నమెంట్ ల్యాబ్ లు, 18 ప్రైవేటు ల్యాబ్స్ లో కరోనా టెస్టులు చేస్తున్నారు. వీటిలో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్ లోని ల్యాబ్ లు మినహా మిగతా 26 గ్రేటర్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో జిల్లాల నుంచి శాంపిల్స్‌‌ పంపించడం, వాటి రిజల్ట్ రావడానికి ఒకట్రెండు రోజుల టైమ్ పడుతోంది. మరోవైపు ఇతర రాష్ర్టాల్లో టెస్టింగ్ కెపాసిటీ 10 వేలు దాటిపోగా, మన రాష్ర్టంలోని సర్కార్ ల్యాబ్ లలో రోజుకు గరిష్టంగా 2 వేలు మాత్రమే ఉంది.

5 జిల్లాల్లో ల్యాబ్ లు

ఈ నేపథ్యంలో టెస్టింగ్ కెపాసిటీని పెంచేందుకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. కరీంనగర్‌‌‌‌, గద్వాల, నిజామాబాద్‌‌, మెదక్, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కరోనా టెస్టుల కోసం ల్యాబ్ లను సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న సీబీ నాట్ యంత్రాలను కరోనా టెస్టుల కోసం వినియోగించుకోవాలని నిర్ణయించారు. టీబీ టెస్ట్ చేసే ఈ యంత్రాలను, కరోనా టెస్టింగ్‌‌కు అనుకూలంగా మార్పులు చేశారు. ఈ 5 ల్యాబ్ లకు పర్మిషన్‌‌ కోసం ఐసీఎంఆర్‌‌‌‌కు వైద్యారోగ్యశాఖ అప్లికేషన్ పంపింది. ఓ వారం రోజుల్లో పర్మిషన్ వచ్చే అవకాశం ఉందని సీనీయర్ ఆఫీసర్‌‌‌‌ ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శాంపిల్స్ ను రిమ్స్‌‌, ఉమ్మడి వరంగల్, పెద్దపల్లి జిల్లాల శాంపిల్స్ ను కాకతీయ మెడికల్ కాలేజీలో టెస్ట్ చేస్తున్నారు. కొత్త ల్యాబ్ లకు పర్మిషన్ వస్తే టెస్టుల సంఖ్య కూడా పెంచడానికి అవకాశం ఉంటుందని జిల్లాల అధికారులు చెబుతున్నారు. వైరస్ లక్షణాలు కొద్దిగా ఉన్నా హాస్పిటల్స్ లో చేర్చుకోవడానికి ప్రైవేటు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందులు కూడా తప్పుతాయంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి