గోల్డ్ ర్యాలీ నిజమైనదేనా.. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెచ్చరిక..!

గోల్డ్ ర్యాలీ నిజమైనదేనా.. న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెచ్చరిక..!

2025లో బంగారం రేటు ఔన్సుకు 4వేల డాలర్లు దాటడం ఆర్థిక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా మంది దీన్ని సురక్షిత పెట్టుబడి విజయంగా భావిస్తున్నారు. అయితే న్యూయార్క్ యూనివర్సిటీలో ఫైనాన్స్ ప్రొఫెసర్ ఆస్వత్ దమోదరన్ మాత్రం ఈ మెగా ర్యాలీ వెనుక ఉన్న అసలు విషయాలను బయటపెట్టారు. అవసరం లేకున్నా ఫోమోతో గోల్డ్ కొంటున్న లక్షల మంది భారతీయులు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవటం మంచిది..

ప్రస్తుతం బంగారం విలువకు మించిన ధరను కలిగి ఉందని తాజా బ్లాగ్ పోస్టులో దమోదరన్ అభిప్రాయపడ్డారు. 2015లో ఔన్సు గోల్డ్ రేటు 1060 డాలర్ల నుంచి నాలుగింతలై 2025లో 4వేల డాలర్ల మార్కును దాటేసిందని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది 57 శాతం ర్యాలీ హైప్ ఫండమెంటల్స్ కి అస్సలు సరిపోవటం లేదన్నారు. ద్రవ్యోల్బణం, సంక్షోభాలకు రక్షణగా చాలా మంది గోల్డ్ రక్షణగా కొంటుంటారు. అయితే అందరూ గుర్తించాల్సిన విషయం స్టాక్స్, బాండ్స్ మాదిరిగా రాబడిని అందించదని దామోదరన్ చెప్పారు. ఎక్కువగా దీనిని సేకరణ వస్తువుగానే పరిగణిస్తారని గుర్తించాలన్నారు. 

ALSO READ : 10 ఏళ్లలో కోటీశ్వరుడు కావాలనుందా..?

దమోదరన్ తన విశ్లేషణలో రెండు చారిత్రక రేషియోల గురించి ప్రస్థావించారు. గోల్డ్–సీపీఐ నిష్పత్తి (Gold-to-CPI ratio), గోల్డ్– సిల్వర్ నిష్పత్తి (Gold-to-Silver ratio). 2025 అక్టోబరులో బంగారం–సీపీఐ నిష్పత్తి 17.81 ఉండగా.. దాని చారిత్రక యావరేజ్ కేవలం 3 మాత్రమే. అదే సమయంలో బంగారం– వెండి నిష్పత్తి 84.73గా నమోదుకాగా.. చారిత్రక సగటు 57.09 కంటే చాలా ఎక్కువని అన్నారు. ఈ రెండు సూచికలు బంగారం ప్రస్తుత ధర చారిత్రకంగా అత్యధికంగా మారిందని వెల్లడిస్తున్నట్లు చెప్పారు. తక్కువ వడ్డీ రేట్లు, నియంత్రిత ద్రవ్యోల్బణం కొత్త సమతుల్యతను సృష్టించవచ్చని, కానీ దానికి కూడా పరిమితి ఉందని స్పష్టం చేశారు.

బంగారం పెట్టుబడిలా కాకుండా ఇన్సూరెన్స్ మాదిరిగా ఉండాలని దామోదరన్ సూచిస్తున్నారు. 2025లో మార్కెట్‌లో ఏర్పడిన భయాలు, భావోద్వేగ పెట్టుబడుల వలన బంగారం తన బేస్ విలువల నుంచి దూరంగా వెళ్లిందని సూచించారు. అయితే దీనివల్ల కొందరు అదృష్టవంతులు మంచి రాబడులను అందుకుని ఉండవచ్చని అన్నారు. అలాగే స్టాక్ మార్కెట్ల పెరుగుదల ఒక బబుల్ అయినప్పుడు గోల్డ్ రేట్ల విపరీతమైన ర్యాలీ కూడా అలా ఎందుకు కాకూడదని ప్రశ్నించారు.