ప్రైవేట్​లో కరోనా టెస్టులకు మూడింతలు వసూల్

ప్రైవేట్​లో కరోనా టెస్టులకు మూడింతలు వసూల్


హైదరాబాద్​, వెలుగు: కరోనా టెస్టులకు ప్రైవేట్ హాస్పిటళ్లు ఇష్టారీతిగా రేట్లు అమలు చేస్తున్నాయి. జనం నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. కొన్ని ప్రైవేట్​ సెంటర్లలో  పర్మిషన్ లేకుండానే టెస్టులు చేస్తున్నారు. సర్కార్​ హాస్పిటళ్లు, సర్కార్​ సెంటర్ల  వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటుండటంతో కరోనా అనుమానితులు ప్రైవేట్​ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అందినకాడికి ప్రైవేటు సెంటర్లు దోచుకుంటున్నాయి. లాస్ట్​ ఇయర్ ప్రైవేట్​ సెంటర్లకు పర్మిషన్​ ఇచ్చిన సమయంలో కరోనా టెస్ట్​కు రూ. 2,250 గా ప్రభుత్వం  నిర్ణయించింది. ఆ తర్వాత క్రమంగా రేట్లు తగ్గించింది. ప్రస్తుతం ప్రైవేట్​ సెంటర్లలో రూ. 500కు ఆర్టీపీసీఆర్​ టెస్టులు చేయాలి. కానీ కొన్ని సెంటర్లలోనే ఈ రేట్లకు టెస్టులు జరుగుతున్నాయి. కొన్ని సెంటర్లలో టెస్టు పేరుతో రూ. 850, పీపీఈ కిట్ల పేరుతో మరో రూ. 500 వసూలు చేస్తుండగా, మరికొన్ని హాస్పిటళ్లు  నేరుగా రూ. 1,500 వరకు  తీసుకుంటున్నాయి. 
శివారు ప్రాంతాల్లో అధికం
గ్రేటర్​ హైదరాబాద్​లో ప్రభుత్వం దాదాపు 50 ప్రైవేటు సెంటర్లకే కరోనా టెస్టుల కోసం పర్మిషన్​ ఇచ్చింది. కానీ ప్రస్తుతం 150కి పైగా ప్రైవేట్​ సెంటర్లలో  టెస్టులు జరుగుతున్నాయి. హైదరాబాద్​ శివారు ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న హాస్పిటళ్లు కూడా కరోనా టెస్టుల కోసం శాంపుల్స్​  కలెక్ట్ చేస్తున్నాయి.  టెస్టుల పర్మిషన్​ ఉన్న సెంటర్లతో చేతులు కలిపి వీళ్లు టెస్టులను చేస్తున్నారు. రిపోర్టులు రెండు రోజుల తర్వాత ఇస్తున్నారు. ఇలా ఒక్కో హాస్పిటల్​లో  డైలీ 50కిపైగా శాంపుల్స్​ కలెక్ట్​ చేస్తున్నారు.  
మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటం
ఎక్కడైనా  ప్రైవేట్​ సెంటర్​లో రూ. 500 కంటే ఎక్కువ వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని హైదరాబాద్​ జిల్లా  డీఎంహెచ్​వో  డాక్టర్‌ వెంకటి చెప్పారు. బయట డబ్బులు పెట్టి చేయించుకోకుండా ప్రభుత్వాసుపత్రుల్లో యాంటిజెన్​, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోవాలని సూచించారు. అన్ని సెంటర్లలో టెస్టుల కోసం ఏర్పాటు చేశామని చెప్పారు.