మహారాష్ట్రపై మళ్లీ కరోనా పడగ

మహారాష్ట్రపై మళ్లీ కరోనా పడగ
  • రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వైరస్‌‌ వ్యాప్తి
  • రెండు వారాల్లోనే 40 వేల కేసులు నమోదు
  • లోకల్‌‌ ట్రైన్లు స్టార్టవడమే కారణమంటున్న కొందరు
  • ఇటీవలి పంచాయతీ ఎన్నికలంటున్న ఇంకొందరు
  • కరోనా రూల్స్‌‌ పాటించకపోతే మళ్లీ లాక్‌‌డౌన్‌‌.. సీఎం ఉద్ధవ్‌‌ వార్నింగ్

ముంబైదేశవ్యాప్తంగా కరోనా కంట్రోల్‌‌లోకి వస్తున్న వేళ మహారాష్ట్రలో మళ్లీ వైరస్‌‌ భయం పెరుగుతోంది. రెండు వారాలుగా అక్కడ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌, మాస్క్‌‌, జనం కదలికలపై ఆంక్షలను పెంచుతున్నారు. కరోనా రూల్స్‌‌ పాటించకపోతే మళ్లీ లాక్‌‌డౌన్‌‌ కూడా పెడ్తామని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ థాక్రే రెండ్రోజుల కిందటే హెచ్చరించారు.

రోజూ 3 వేలకు పైగా కేసులు

రాష్ట్రంలో ఫిబ్రవరి తొలి రోజు నుంచీ రోజూ 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు 17 వేల కేసులు రికార్డయితే.. 8 నుంచి 15వ తేదీ మధ్య 20 వేల కేసులు నమోదయ్యాయి. ముంబై, పుణే, విదర్భ ప్రాంతాల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో నమోదైన కేసుల్లో 60 శాతం వరకు ముంబై, నాగ్‌‌పూర్‌‌, థానే, అమరావతిల్లోనే నమోదయ్యాయి. అమరావతి జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరికి పాజిటివ్‌‌ వస్తోందని అధికారులు చెప్పారు.

లోకల్​ ట్రైన్లే కారణమా?

ముంబై ప్రాంతంలో లోకల్‌‌ ట్రైన్స్‌‌ను తిరిగి ప్రారంభించడమే కేసులు పెరగడానికి అసలు కారణమని పలువురు చెబుతున్నారు. విదర్భలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల వల్ల వైరస్‌‌ వ్యాప్తి పెరిగి ఉంటుందని అంటున్నారు. లాక్‌‌డౌన్‌‌ వల్ల వాయిదా పడిన పెండ్లిళ్లు, ఫంక్షన్లు ఇప్పుడు జరుగుతుండటం ఇంకో కారణమని ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు.

కేసులు ఇలాగే పెరిగితే​ స్కూళ్లు మూసేస్తం..

రాష్ట్రంలో కరోనాను కంట్రోల్​ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సూచనలను ప్రజలు పాటించట్లేదని ఆరోగ్య మంత్రి రాజేశ్‌‌ థోపే చెప్పారు. ఫేస్‌‌ మాస్కులను పెట్టుకోవట్లేదని, ఫిజికల్​ డిస్టెన్స్ పాటించట్లేదని అన్నారు. ఈ రెండింటినీ కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. పరిస్థితి మరింత తీవ్రమైతే స్కూళ్లను మూసేయాలని కూడా చెప్పినట్లు మంత్రి వివరించారు.

ఆంక్షలున్నా సరిగ్గా అమలుకావట్లే..

రాష్ట్రంలో ఫంక్షన్లకు 50 మందికి మించి హాజరయ్యేందుకు అనుమతిలేదు. ర్యాలీలు, ఆందోళనలు, ప్రజలు ఒకచోట చేరడంపై ఆంక్షలున్నాయి. ఒకటి కన్నా ఎక్కువ పాజిటివ్‌‌ కేసులు నమోదైన బిల్డింగ్‌‌ను సీజ్‌‌ చేస్తారు. మాస్కులు పెట్టుకోకున్నా, ఫిజికల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించకున్నా భారీ ఫైన్లు వేస్తున్నారు.