
వాషింగ్టన్: అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 7.38లక్షలు దాటింది. 39 వేల మందికిపైగా చనిపోయారు. కేవలం న్యూయార్క్ లోనే 17 వేల మందికిపైగా చనిపోగా, 2 లక్షల మందికి కరోనా సోకింది. అమెరికాలో మొత్తం మృతుల సంఖ్యలో సగం న్యూయార్క్ లోనే నమోదయ్యాయి. న్యూజెర్సీలో 81 వేలకుపైగా కేసులు నమోదు కాగా 4,070 మంది మరణించారు.
వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా ఎస్కేప్: ట్రంప్
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే తప్పించుకుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ‘వాళ్లు చెప్పే గబ్బిలం వుహాన్లోనిది కాదు. అక్కడి నుంచి 40 మైళ్ల దూరంలోని వేరే ప్రాంతానికి చెందింది’ అని చెప్పారు. వూహాన్ లో కరోనా డెత్ కౌంట్ ను డబుల్ చేసి అక్కడి అధికారులు వెల్లడించారని, కానీదాని కంటే ఎక్కువగానే ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. ‘యూఎస్ కంటే అధిక స్థాయిలో చైనా కరోనా మృతుల సంఖ్య ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. వూహాన్ లోని లెవెల్-4 ల్యాబ్ కు అమెరికా ఇస్తున్న గ్రాంట్ నిలిపివేస్తామని చెప్పారు. అమెరికాలో శుక్రవారం నాటికి 37.8 లక్షల మందికి టెస్టులు చేశామన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మృతుల సంఖ్య 65 వేల వరకు చేరే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ రంగానికి ట్రంప్19 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. కరోనా కారణంగా నష్టపోయిన రైతులకు నేరుగా ఈ పేమెంట్స్ చెల్లించనున్నారు.