కరోనా ఇమ్యూనిటీ 3 నెలలే.!

కరోనా ఇమ్యూనిటీ 3 నెలలే.!

లండన్‘ఇంకొన్ని రోజులల్లో వ్యాక్సిన్ వస్తున్నది.. అప్పటిదాకా పైలంగా ఉంటే అయిపాయే’ అనుకుంటున్నరు చాలా మంది. కానీ అట్లాంటిదేం లేదంటున్నరు ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌, కింగ్స్ కాలేజ్ లండన్ సైంటిస్టులు. కరోనా ఇమ్యూనిటీ మూడు నెలలే ఉంటదంటున్నరు. తీవ్రత ఎక్కువున్నోళ్లలో ఇంకాస్త ఎక్కువ టైమ్‌‌‌‌ ఉంటదని చెబుతున్నరు. వ్యాక్సిన్‌‌‌‌తో వచ్చే ఇమ్యూనిటీ కూడా అంతే ఉంటదని, ఒక్క డోస్‌‌‌‌ వేసుకుంటే సరిపోదని, ఏటా వేసుకోవాల్సిందేనని వివరిస్తున్నరు. సర్దిలాగానే ఏటా కరోనా వచ్చి పోతదని, వ్యాక్సిన్లు వేసుకున్నంత మాత్రాన మనం భద్రంగా ఉన్నట్టు కాదని చెబుతున్నరు. హెర్డ్‌‌‌‌ ఇమ్యూనిటీ చాలా డేంజరని, ఏటా ఇన్ఫెక్టయితే లంగ్స్‌‌‌‌ పాడై చనిపోతారని హెచ్చరిస్తున్నరు.

17% మందికే సక్సెస్​

కరోనా ఇమ్యూనిటీ గురించి తెలుసుకోవడానికి బ్రిటన్ రాజధాని లండన్‌‌‌‌లోని ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఫౌండేషన్, కింగ్స్ కాలేజ్ లండన్ సైంటిస్టులు స్టడీ చేశారు. కరోనా సోకి తగ్గాక ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తి) ఎంతో కాలం ఉండదని తేల్చి చెప్పారు. ఆ వైరస్‌‌‌‌ను ఎదుర్కొనేందుకు తయారైన యాంటీబాడీలు మన ఒంట్లో 3 నెలల తర్వాత మాయమైపోతాయని షాక్ ఇచ్చారు. 90 మందికిపైగా కరోనా పేషెంట్లు, హెల్త్​కేర్​ వర్కర్లపై స్టడీ చేసి ఈ విషయాన్ని నిర్ధారించారు. ‘స్టడీలో పాల్గొన్న వాళ్లలో 60% మందిలోనే కరోనాను ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు తయారయ్యాయి. అవి తయారైన వాళ్లలో 17% మందికే 3 నెలల తర్వాత  ఇమ్యూనిటీ పవర్ ఉంది. మిగతా వాళ్లలో యాంటీబాడీలు 23 రెట్లు పడిపోయాయి. ఇంకొన్ని కేసుల్లోనైతే యాంటీబాడీలే లేవు’ అని చెప్పారు.

తీవ్రత ఎక్కువున్నోళ్లలోనే ఎక్కువ టైమ్‌‌‌‌

కరోనా ఎక్కువున్న పేషెంట్లలోనే 3 నెలల తర్వాత కూడా యాంటీబాడీల స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు. దానికీ కారణం లేకపోలేదు.. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే దాన్ని ఎదుర్కొనేందుకు అదే స్థాయిలో యాంటీబాడీలూ అవసరమవుతాయి. ఆ క్రమంలోనే సీరియస్ పేషెంట్లలో ఎక్కువ పవర్​ఫుల్ యాంటీబాడీలు తయారయ్యాయట. తీవ్రత తక్కువున్న పేషెంట్లతో పోలిస్తే వీళ్లలో అవి ఎక్కువ కాలం పాటు ఒంట్లో ఉంటాయట. ‘‘వైరస్​ సోకిన వాళ్లలో యాంటీబాడీ రెస్పాన్స్ బాగానే ఉంటోంది. కానీ కొన్నాళ్లే ఉంటోంది. కరోనా తీవ్రతపైనే ఇమ్యూనిటీ ఆధారపడి ఉంది. వైరల్ లోడ్ ఎంతెక్కువ ఉంటే అంత ఇమ్యూనిటీ ఉంటోంది. వాళ్లకే ఎక్కువ కాలం యాంటీబాడీలుంటున్నాయి. మామూలు రోగుల్లో వాటి టైమ్‌‌‌‌ రెండు నుంచి మూడు నెలలే’’ అని స్టడీని లీడ్ చేసిన కింగ్స్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ డాక్టర్ కేటీ డూరీస్ చెప్పారు.

హెర్డ్ ఇమ్యూనిటీ చాలా డేంజర్​

హెర్డ్ ఇమ్యూనిటీ.. ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట. అంటే జనాలంతా వైరస్‌‌‌‌కు ఎక్స్‌‌‌‌పోజై దాన్నుంచి విముక్తి పొందడానికి వచ్చే ‘రోగాన్ని అడ్డుకునే శక్తి’ అన్నమాట. ఈ విషయంలో ఇప్పటికే స్వీడన్, స్పెయిన్ లాంటి దేశాలు ప్రయోగాలు చేసి ఫెయిల్ అయ్యాయి. ఈ హెర్డ్​ ఇమ్యూనిటీ కాన్సెప్టే చాలా డేంజరని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కేంబ్రిడ్జి వర్సిటీ సైంటిస్టులూ కరోనాతో వచ్చే ఇమ్యూనిటీ కాలం తక్కువేనంటున్నారు. ఇలాంటి టైంలో హెర్డ్ ఇమ్యూనిటీని ఫాలో కావొద్దని సూచిస్తున్నారు. ‘‘చాలా మంది జనాలు హెర్డ్​ ఇమ్యూనిటీపై ఫోకస్ పెట్టారు. కానీ అది చాలా డేంజరని ఎంత మందికి తెలుసు? ముఖ్యంగా దానిపై యువత చాలా నిర్లక్ష్యంగా ఉంటోంది. హెర్డ్ ఇమ్యూనిటీనే బెస్ట్ అనుకుంటోంది. కానీ ఆ నిర్లక్ష్యంతోనే తమని తాము వాళ్లు ప్రమాదంలో పడేసుకుంటున్నారన్న విషయం మరిచిపోతున్నారు. వాళ్లు కరోనా బారిన పడుతుండడంతో పాటు వేరే వాళ్లనూ బాధితులుగా మారుస్తున్నారు. దాని వల్ల ఓసారి ఇమ్యూనిటీ వచ్చినా తర్వాత పోతది. ఏటా ఇదే జరిగితే వాళ్ల ఊపిరితిత్తులు బాగా పాడైపోతాయి. ప్రాణాలూ పోతాయి’’ అని కేంబ్రిడ్జ్ వర్సిటీ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జొనాథన్ హీలీ హెచ్చరించారు.

వ్యాక్సిన్ ఒక్కసారేస్తే చాలదు

కరోనాను నయం చేయడానికి ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడా సరైన మందుల్లేవు. ఏవో కొన్ని పాత మందులను తెరపైకి తెచ్చి ఉపశమనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప కొత్త మందులపై ప్రయోగాలు మొదలు కాలేదు. వ్యాక్సిన్లపై మాత్రం జోరుగానే పనులు సాగుతున్నాయి. ఓ 13 కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ తెచ్చేందుకు ఆక్స్‌‌‌‌ఫర్డ్ సీరియస్‌‌‌‌గా పని చేస్తోంది. మన దేశంలో ఆగస్టు 15 నాటికల్లా వ్యాక్సిన్ వస్తదని ఐసీఎంఆర్ ప్రకటన కూడా చేసింది. కానీ ఏ వ్యాక్సిన్ ఏ స్టేజ్‌‌‌‌లో ఉన్నా ఒక్క డోస్ వేసుకుంటే సరిపోదని సైంటిస్టులు తేల్చి చెబుతున్నారు. డైరెక్ట్‌‌‌‌గా వైరస్ సోకితే మూడు నెలలకు మించి ఇమ్యూనిటీ ఉండట్లేదంటున్నారు. అలాంటిది ఇనాక్టివ్​ చేసిన లేదా వైరస్‌‌‌‌లోని ప్రొటీన్లతో చేసిన వ్యాక్సిన్‌‌‌‌తో ఎంత వరకు మేలు జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ‘‘ఈ విషయంలో వైరస్ ఇన్‌‌‌‌ఫెక్షనే సమాధానం చెప్పింది. ఇన్‌‌‌‌ఫెక్ట్ అయితే పుట్టే యాంటీబాడీలు, మనం తయారు చేసే వ్యాక్సిన్ ద్వారా పుట్టే యాంటీబాడీలకూ ఒకే జీవితకాలం ఉంటుంది. అంతకన్నా తక్కువగా కూడా ఉండొచ్చు. కాబట్టి కరోనాకు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఒక్క వ్యాక్సిన్ డోస్ చాలదు’’ అని డూరీస్​ అన్నారు. కరోనా బారి నుంచి కాపాడుకోవాలంటే ఏటా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. ఉదాహరణకు ఆక్స్‌‌‌‌ఫర్డ్ వర్సిటీ చేస్తున్న చేడాక్స్​1ఎన్​కొవ్​19 వ్యాక్సిన్​ ప్రయోగాల్లో కోతులకు కొద్ది స్థాయిలోనే యాంటీబాడీలు తయారయ్యాయి. వ్యాక్సిన్‌‌‌‌తో వాటికి రక్షణ వచ్చినా మళ్లీ అవి ఇన్​ఫెక్ట్ అయ్యాయి.

సర్ది లాగే కరోనా వస్తది పోతది

ప్రతి సీజన్‌‌‌‌లో సర్ది వచ్చిపోయినట్టే కరోనా కూడా వచ్చిపోతదని సైంటిస్టులు తేల్చి చెప్పారు. ‘‘ప్రస్తుతం మామూలు జలుబుకు కారణమయ్యే కరోనా వైరస్‌‌‌‌లు నాలుగు రకాలున్నాయి. వాటితో తరచూ జనాలకు జలుబు పట్టుకుంటోంది. కరోనా విషయంలో అదే జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. కరోనా పేషెంట్లలో ఎక్కువ కాలం ఇమ్యూనిటీ ఉండకపోవడమే అందుకు ఉదాహరణ. సర్ది లాగే ఇదీ వచ్చే పోయే అవకాశాలెక్కువ. కాబట్టి వ్యాక్సిన్లు వేసుకున్నంత మాత్రాన మన భద్రంగా ఉన్నట్టు కాదు. అది తాత్కాలికమే’’ అని స్టడీలో పాల్గొన్న సైంటిస్ట్ ప్రొఫెసర్ స్టువర్ట్ నీల్ చెప్పారు.

ప్రైవేట్ లో ఆన్ లైన్ క్లాసులను ఎందుకు బ్యాన్ చేస్తలేరు