
కరోనా వైరస్‌తో మహారాష్ట్ర అతలాకుతలం అవుతుంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా మరో కలకలం రేగింది. ఒకే పోలీస్ స్టేషన్‌లో 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. ముంబైలోని వడాలా పోలీస్ స్టేషన్‌లో ఇది చోటు చేసుకుంది. గురువారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలడంతో వారందర్నీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్టేషన్‌ను శానిటైజ్ చేశారు.
బాధితులందరినీ బాంద్రా, పరేల్, దక్షిణ ముంబైలోని గురునానక్, కేఈఎం, బాంబే హాస్పిటళ్లకు తరలించామని డిప్యూటీ కమిషనర్ రష్మి కరాండికర్ తెలిపారు. వైరస్ బారినపడిన కానిస్టేబుళ్లు అందరూ 50 ఏళ్లు పైబడినవారేనని, వారి కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్ చేశామని తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 106 మంది పోలీసులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. వీటిలో ఒకే పోలీస్ స్టేషన్‌లో ఇంత మంది కానిస్టేబుళ్లకు వైరస్ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది. ఈ స్టేషన్ పరిధిలో ఏడు రెడ్‌జోన్లతోపాటు నాలుగు మురికివాడలు ఉన్నాయి. తరుచూ వీరంతా నిత్యావసరాలను పంపిణీ చేయడం, ప్రజలను అప్రమత్తం చేస్తూ.. విధులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నవారితో వైరస్ సోకినట్టుగా భావిస్తున్నారు.