బిహార్‌లోని బంకా జిల్లాలో దారుణం జరిగింది. కటింగ్ చేసేందుకు ఒప్పుకోలేదన్న కారణంతో ఓ బార్బర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. మైన్వా గ్రామానికి చెందిన దినేశ్ ఠాకూర్(42) అనే బార్బర్ ఇటీవల ముంబై నుంచి రావడంతో హోం క్వారంటైన్లో ఉన్నాడు. అయితే అ గ్రామానికి చెందిన కొందరు యువకులు అతణ్ని కటింగ్, షేవింగ్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. లాక్ డౌన్‌లో తాను పని చేయనని, పోలీసులకు తెలిస్తే తనను పట్టుకుపోతారని అతడు అంగీకరించలేదు. ఈ క్రమంలో బిపిన్ దాస్ అనే వ్యక్తి దినేష్ ఠాకూర్‌నే తన ఇంటికి రావాలంటూ కబురు పంపాడు. అలా వెళ్లిన దినేష్.. మరుసటి రోజు బుల్లెట్ గాయాలతో ఊరి చెరువులో విగతజీవిగా పడిఉన్నాడు. దీనిపై దినేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు బిపిన్ దాస్ పరారీలో ఉన్నాడని, ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసామని అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ కుమార్ సన్నీ తెలిపారు.
