
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 55 లక్షల మందికి పైగా ఈ వైరస్ సోకింది. దాదాపు మూడున్న లక్షల మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుండడంతో దీనిని నియంత్రించేందుకు ప్రపంచంలో అనేక దేశాలు లాక్ డౌన్ నే మార్గంగా ఎంచుకున్నాయి. అలసత్వం ప్రదర్శించిన కొన్ని దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే భారత్ ముందస్తుగానే మేలుకుని మార్చి 25 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. దశల వారీగా పొడిగిస్తూ వచ్చిన కేంద్రం ప్రస్తుతం లాక్ డౌన్ 4.0ను ఈ నెల 31 వరకు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే క్రమంగా రెండో దశ లాక్ డౌన్ తర్వాతి నుంచి ఆంక్షలు సడలిస్తూ వస్తోంది. కరోనా నుంచి కాపాడుకుంటూనే ఆర్థికంగా కూడా నిలదొక్కుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.
హిమాచల్ ప్రదేశ్ లో మరో నెల పొడిగింపు
ప్రస్తుతం అన్ని జోన్లలోనూ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలకు, ప్రజా రవాణాకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే ఇటీవల వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్లు తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రంలోని హమీర్పూర్, సోలన్ జిల్లాల్లో మే 31తో ముగుస్తున్న లాక్ డౌన్ ను జూన్ 30 వరకు కొనసాగిస్తూ ఆ జిల్లాల కలెక్టర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 214 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 63 కేసులు హమీర్పూర్ లో, 21 కేసులు సోలన్ జిల్లాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు తిరి స్వస్థలాలకు వచ్చిన తర్వాతే ఈ రెండు జిల్లాల్లో కేసులు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గడిచిన 30 రోజుల్లో దాదాపు 10 వేల మంది దేశంలోని వేర్వేరు రెడ్ జోన్ ఏరియాల నుంచి హమీర్పూర్ వచ్చారని ఆ జిల్లా కలెక్టర్ హరికేశ్ మీనా తెలిపారు. కాగా, ఈ రెండు జిల్లాల్లో లాక్ డౌన్ పొడిగిస్తున్నప్పటికీ నిత్యావసర, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కఠినంగా అమలవుతుందని తెలిపారు.