మే 4 నుంచి భారీగా లాక్​డౌన్ సడలింపులు: కేంద్ర హోంశాఖ

మే 4 నుంచి భారీగా లాక్​డౌన్ సడలింపులు: కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ: మే 4 నుంచి భారీ స్థాయిలో లాక్​డౌన్ మినహాయింపులు ఉండనున్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన దేశవ్యాప్త లాక్​డౌన్ మే 3 న ముగియనున్న నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని హోంశాఖ బుధవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపింది. కొత్త మార్గదర్శకాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించింది. దేశవ్యాప్త లాక్​డౌన్ కారణంగా నెల రోజుల పాటు వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులు, విద్యార్థులను సొంతూళ్లకు అనుమతించే ప్రణాలికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రెడ్ జోన్లు, హాట్ స్పాట్​లలో మాత్రం లాక్​డౌన్ యథావిధిగా కొనసాగవచ్చని పేర్కొంది. లాక్​డౌన్ సడలింపు చర్యలపై ప్రధాని మోడీ తుది నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. దీనిని బట్టి చూస్తుంటే గ్రీన్ జోన్లలో మినహాయింపులు ఎక్కువ ఇస్తూనే రెడ్ జోన్లలో లాక్​డౌన్ మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా పదిహేను రోజుల్లో కరోనా హాట్​స్పాట్లు, రెడ్ జోన్లుగా ప్రకటించిన జిల్లాల సంఖ్య 170 నుంచి 129 కి పడిపోయింది. ఇదే క్రమంలో గ్రీన్ జోన్లు కూడా 325 నుంచి 307 కి తగ్గాయి. అయితే ఆరెంజ్ జోన్లు మాత్రం 207 నుంచి 297 కు పెరిగాయి.