13ఏళ్ల బాలిక‌.. కేన్స‌ర్ పేషెంట్.. కాలికి స‌ర్జ‌రీ: లాక్ డౌన్ తో కాలి న‌డ‌క‌న‌ ఊరికి

13ఏళ్ల బాలిక‌.. కేన్స‌ర్ పేషెంట్.. కాలికి స‌ర్జ‌రీ: లాక్ డౌన్ తో కాలి న‌డ‌క‌న‌ ఊరికి

ఈ ఫొటోలో వాక‌ర్ చేత‌ప‌ట్టి న‌డుస్తున్న అమ్మాయి పేరు విశాక‌.. 13 ఏళ్ల వ‌య‌సులోనే ఆ చిన్నారి కేన్స‌ర్ కోర‌ల్లో చిక్కుకుంది. కాలిలో వ‌చ్చిన క‌ణితి కేన్స‌ర్ గా మారి.. స‌ర్జ‌రీ వ‌ర‌కు వెళ్లింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్) హాస్పిట‌ల్ లో తొమ్మిది నెల‌లుగా చికిత్స పొందుతోంది. కొన్నాళ్ల క్రిత‌మే డాక్ట‌ర్లు ఆ అమ్మాయి కాలికి స‌ర్జ‌రీ చేశారు. ఈ స‌మ‌యంలోనే దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాపించ‌డం.. దాని క‌ట్ట‌డికి కేంద్రం లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఆ చిన్నారికి కొత్త క‌ష్టం వ‌చ్చింది. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ చేయ‌డంతో ఎటూ వెళ్లే వీలు లేకుండా పోయింది. ర‌వాణా స‌దుపాయం లేక‌పోవ‌డంతో అప్పుడ‌ప్పుడే కోలుకుంటున్న ఆ బాలిక‌ను వెంట‌బెట్టుకుని త‌ల్లిదండ్రులు కాలి న‌డ‌క‌నే 400 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఊరికి బ‌య‌లుదేరారు. వాళ్ల‌ను గుర్గావ్ వ‌ద్ద‌ గ‌మ‌నించి.. ఓ జాతీయ మీడియా సంస్థ మాట్లాడ‌గా.. త‌మ గోడు చెప్పుకున్నారు ఆ బాలిక త‌ల్లిదండ్రులు.

‘మా స్వ‌స్థ‌లం రాజ‌స్థాన్ లోని పుష్క‌ర్. మా అమ్మాయి కేన్స‌ర్ రావ‌డంతో ఎయిమ్స్ లో 9 నెల‌లుగా చికిత్స చేయిస్తున్నాం. ఇటీవ‌ల స‌ర్జ‌రీ చేశారు. కానీ క‌రోనా లాక్ డౌన్ కావ‌డంతో ఇక్క‌డ చిక్కుకుపోయాం. ఎయిమ్స్ లో క‌నీసం మాకు తాగ‌డానికి నీళ్లు కూడా ఇవ్వ‌డం లేదు. గేటు ద‌గ్గ‌ర గార్డులు ఇక్క‌డి నుంచి వెళ్లిపోవాలంటూ నాపై దాడి చేయ‌బోయారు. ఇక మ‌రో దారి లేక కాలిన‌డ‌క‌న బ‌య‌లు దేరాం’ అని త‌న ఆవేద‌నను ఆ మీడియా సంస్థ‌తో చెప్పింది విశాక త‌ల్లి గంగ‌.

నా బిడ్డ న‌డ‌వ‌లేక‌పోతోంది

ఎయిమ్స్ ద‌గ్గ‌రి నుంచి ధౌలా కౌన్ వ‌ర‌కు ఆస్ప‌త్రికి సంబంధించిన బ‌స్సులో డ్రాప్ చేశార‌ని, అక్క‌డి నుంచి గుర్గావ్ వ‌ర‌కు చిన్న‌గా న‌డుచుకుంటూ వ‌చ్చామ‌ని చెప్పాడు విశాక తండ్రి. హాస్పిట‌ల్ దగ్గ‌ర తిండి కూడా దొర‌క్క‌పోవ‌డంతో ఏం చేయాలో తెలియ‌క ఊరికి బ‌య‌లు దేరామ‌ని, ఇక్క‌డి నుంచి దాదాపు 400 కిలో మీట‌ర్లు వెళ్లాల‌ని అన్నాడు. త‌న బిడ్డ కొద్ది దూరం కూడా న‌డ‌వ లేక‌పోతోంద‌ని, దారిలో ఏదైనా లారీ లేదా కారు దొరుకుతుంద‌న్న ఆశ‌తో ఊరికి క‌దిలామ‌ని చెప్పాడత‌ను.