చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు 200 దేశాలకు ఈ వైరస్ వ్యాప్తించింది. ఇప్పటి వరకు 26 లక్షల 60 వేల మందికి పైగా కరోనా సోకింది. లక్షా 85 వేల మందిని బలితీసుకుంది. ఈ వైరస్ కొత్తది కావడంతో ప్రస్తుతానికి ఎటువంటి మందులు, వ్యాక్సిన్ అందుబాటులో లేవు. ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధన సంస్థలు వ్యాక్సిన్ తయారీ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే వేర్వేరు వ్యాధులకు ఉన్న వ్యాక్సిన్లు, మందులపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి.
కరోనా వైరస్ కు దగ్గరగా MMR
కరోనా వైరస్ రాకుండా నివారించడంలో MMR వ్యాక్సిన్ సాయపడుతుందని ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మీజిల్స్, మంప్స్, రూబెల్లా లాంటి వ్యాధులకు ఇచ్చే వ్యాక్సిన్ వ్యాక్సిన్ కొంత మేర కరోనా నుంచి రక్షణ ఇవ్వగలదని చెబుతున్నారు. రూబెల్లాకు కారణమయ్యే వైరస్ స్ట్రక్చర్ 29 శాతం కరోనా వైరస్ తో పోలి ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని, దీని వల్ల ఆ వ్యాక్సిన్ దీనిపై కూడా పని చేయొచ్చని డాక్టర్ యొర్గో మోడిస్, ప్రొఫెసర్ రాబిన్ ఫ్రాంక్లిన్ తెలిపారు. అలాగే రూబెల్లా వచ్చిన నయమైన వాళ్లలో, కరోనా బారినపడి కోలుకున్న వారి రక్తంలోనూ ఒకే రకమైన యాండీబాడీస్ అభివృద్ధి చెందినట్లు గుర్తించామన్నారు. దీని వల్ల రూబెల్లా బారినపడి నయమైన వాళ్లకు కరోనా సోకే చాన్స్ తక్కువ అని, అప్పటికే శరీరంలో ఉన్న యాంటీ బాడీస్ కరోనాను అడ్డుకోవడంలో సాయపడుతాయని చెప్పారు.
టీబీ వ్యాక్సిన్…
ఇటీవలే కొన్ని రీసెర్చ్ సంస్థలు టీబీ వ్యాక్సిన్ ద్వారా కరోనాను ఎదుర్కోవచ్చని అంచనా వేశాయి. బిడ్డలు పుట్టిన తర్వాత తప్పనిసరిగా వ్యాక్సిన్ ఇస్తున్న దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉందని తెలిపాయి. అయితే కేవలం అంకెల ఆధారంగా టీబీ వ్యాక్సిన్ కరోనాను నివారించగలుగుతోందని చెప్పలేమని, ప్రయోగాత్మక ఆధారాలు ఏమీ లేకుండా నిర్ధారణకు రాలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
