రెండు మూడు వారాల్లో పుణేలో క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ: ఇండియ‌న్ కంపెనీ

రెండు మూడు వారాల్లో పుణేలో క‌రోనా వ్యాక్సిన్ త‌యారీ: ఇండియ‌న్ కంపెనీ

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి మ‌రో రెండు మూడు వారాల్లోనే భార‌త్ లో వ్యాక్సిన్ త‌యార‌వ‌బోతోంది. ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీతో క‌లిసి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ పై ప్ర‌యోగాలు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆప్ ఇండియా (ఎస్ఐఐ) ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. పుణేకు చెందిన ఈ కంపెనీ ఆక్స్ ఫ‌ర్డ్ వర్సిటీ సైంటిస్ట్ డాక్ట‌ర్ హిల్ బృందంతో క‌లిసి ప‌ని చేస్తోంది. ఇప్ప‌టికే వ్యాక్సిన విజ‌య‌వంతంగా త‌యారు చేసిన శాస్త్ర‌వేత్త‌లు దానిని మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు కూడా స్టార్ట్ చేశారు. ఇంగ్లండ్ లో కొంద‌రు వాలంటీర్స్ కు క‌రోనా వ్యాక్సిన్ ఇచ్చి.. దాని ప‌నితీరును ప‌రిశీలిస్తున్నారు.

వ్యాక్సిన్ బాగా పని చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే సెప్టెంబ‌ర్ – అక్టోబ‌ర్ మ‌ధ్య మార్కెట్ లోకి క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చేస్తుంద‌ని సీరం కంపెనీ సీఈవో తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను భార‌త్ లోనూ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్రారంభించేందుకు భార‌త ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టామ‌న్నారు. భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్), డిపార్ట్ మెంట్ ఆఫ్ బ‌యోటెక్నాల‌జీల‌తో టచ్ లో ఉన్నామ‌ని, త్వ‌ర‌లోనే అప్రోవ‌ల్స్ వ‌స్తాయ‌ని అన్నారు. మ‌రో రెండు మూడు వారాల్లోనే మ‌న దేశంలోనూ మ‌నుషుల‌పై క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌యోగిస్తామ‌ని తెలిపారు.

నెల‌కు 50 ల‌క్ష‌ల డోస్ ల త‌యారీ

క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌యోగాలు విజ‌య‌వంత‌మైతే ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రావ‌డం ఆల‌స్యం కాకూడ‌ద‌ని కంపెనీ రిస్క్ చేసి మ‌రీ ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆద‌ర్ పూనావాలా. ప్ర‌స్తుతం ప్ర‌పంచం ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ ప్ర‌యోగాలు స‌క్సెస్ అవుతాయ‌ని ఆశ‌తో సొంత ఖ‌ర్చుతో పుణేలోని కంపెనీ యూనిట్ లో వ్యాక్సిన్ త‌యారీ స్టార్ట్ చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌రో రెండు మూడు వారాల్లో త‌యారీ స్టార్ట్ చేసి ఆరు నెల‌ల పాటు ప్ర‌తి నెలా 50 ల‌క్ష‌ల డోస్ ల త‌యారీ ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత నెల‌కు కోటి డోసుల చొప్పున త‌యారు చేస్తామ‌న్నారు ఆద‌ర్.

ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండాలి

క‌రోనా వ్యాక్సిన్ ప్ర‌జ‌లంద‌రికీ అందుబాటులో ఉండాల‌ని, అందుకు ఈ వ్యాక్సిన్ పై పేటెంట్ తీసుకోబోమ‌ని ఆద‌ర్ పూనావాలా చెప్పారు. వీలైన‌న్ని ఎక్కువ‌ కంపెనీలు వేగంగా కోట్లాది డోస్ ల‌ను త‌యారు చేయాల‌ని అన్నారు. భార‌త్ లోనే కాదు ప్ర‌పంచ‌మంతా ఈ వ్యాక్సిన్ ను వేర్వేరు కంపెనీలు త‌యారు చేసి, సేల్స్ చేసేందుకు వీలుగా ఉండాల‌ని, అందుకు పేటెంట్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ని తెలిపారు. వేరే ఇత‌ర ప‌రిశోధ‌న సంస్థ‌లు ఏవైనా క‌రోనా వ్యాక్సిన్ రూపొందించినా.. పేటెంట్ తీసుకోకుండా.. ఇత‌ర కంపెనీల‌తోనూ ఒప్పందం చేసుకుని ఆ ఫార్ములాను షేర్ చేసుకోవాల‌ని అన్నారు.