
కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులను తగ్గించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ వెల్లడించారు. అధిక ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ విద్యా సంస్థల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఉదయం బీజేవైఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈసందర్భంగా బీజేవైఎం జాతీయ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విద్య అనేది పేదలకు అందని ద్రాక్షగా మారిందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలన్నారు.