నిర్మల్, వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శుక్రవారం నిర్మల్కలెక్టరేట్ లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ చేపట్టగా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తోందని, రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసిందన్నారు.
11 వేల పొదుపు సంఘాల్లో దాదాపు 80 వేల మంది దివ్యాంగులు లబ్ధిపొందుతున్నారని తెలిపారు. దివ్యాంగుల ఆరోగ్యం కోసం బాల భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. అర్హులైన పలువురికి ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు, అడ్వాన్స్డ్ చక్రాల కుర్చీలు అందించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో కార్పొరేషన్ చైర్మన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కలిసి 38 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ప్రత్యేక స్కూటీలు అందజేశారు. కార్యక్రమంలో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి వినూత్న, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
