
- రోడ్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు
రామచంద్రాపురం, వెలుగు: ప్రజలు రవాణాకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడూ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి రోడ్ సేఫ్టీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాక్ సొసైటీ, బీడీఎల్ కాలనీలలో రోడ్లను పరిశీలించి దగ్గరుండి గుంతలను పూడ్పించారు. అనంతరం పార్కు పరిసరాల్లో పర్యటించి స్థానికులకు ఎలాంటి సమస్యలు రాకుండా పలు చర్యలు చేపట్టారు.
అధికారులు, కాలనీ అసోసియేషన్ల సమన్వయంతో రోడ్ల పరిస్థితులపై స్పందించాలని కోరారు. వర్షా కాలంలో ఎప్పటికప్పుడు రోడ్లను బాగు చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. చిన్నారుల కోసం ప్లే ఎక్విప్మెంట్, సీనియర్ సిటిజన్లకు బెంచీలను పార్కులలో ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ ఏఈ ఫైజాన్, వర్క్ ఇన్స్పెక్టర్అక్రమ్, మ్యాక్ సొసైటీ డైరెక్టర్లు దుర్గారెడ్డి, రామారావు, విజయ్, రాజు, కొండల్పాల్గొన్నారు.