హైదరాబాద్, వెలుగు: బల్దియా సమావేశం నిర్వహించాలంటూ మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. కౌన్సిల్ ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా 30 గంటలు కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగలేదని పేర్కొన్నారు. చట్టం ప్రకారం ప్రతి మూడు నెలలకు నిర్వహించాల్సిన సమావేశాన్ని కనీసం ఆరు నెలలకు కూడా జరగట్లేదని పిటిషన్లో వివరించారు. ఇప్పటి వరకు కేవలం 7 మీటింగ్లు మాత్రమే నామమాత్రంగా నిర్వహించారని కౌన్సిల్లో చర్చించిన పనులు సైతం లోప భూయిష్టంగానే జరుగుతున్నాయన్నారు.
మేయర్, కమిషనర్ సభలో అర్థవంతమైన చర్చలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ ఒక్క మీటింగ్లో కూడా ఎజెండాపై, పూర్తి స్థాయి సభ్యుల ప్రశ్నల పైనా చర్చ జరగలేదని తెలిపారు. మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం పెట్టాలని వినతి పత్రాలను మేయర్, అధికారులకు ఇస్తున్నా ఫలితం లేదని, అన్ని విభాగాల్లో భారీగా అవినీతి బట్టబయలు అవుతుందనే భయంతోనే కౌన్సిల్ సమావేశం జరుపట్లేదని పిటిషనర్ ఆరోపించారు. ఇక నుంచైనా సభ సజావుగా నిర్వహించి, ప్రజా సమస్యలపై చర్చ జరిగేలా చూడాలని అందుకు ఆదేశించాలని హైకోర్టును కోరారు.