హెడ్ రెగ్యులేటర్ డిజైన్‌లో మార్పులు
821 అడుగుల నుంచి 800 అడుగులకు తగ్గింపు
స్టాండ్ బై మోటారు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ప్రాజెక్టులో కీలక మార్పులకు ఓకే చెప్పిన సర్కారు
హైదరాబాద్, వెలుగు : పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సర్కార్ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఇన్నాళ్లూ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా నిర్ణయాలు తీసుకున్న సర్కారు.. ఇప్పుడు వెనక్కు తగ్గింది. పాలమూరు లిఫ్ట్ పై సర్కారు చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ‘వెలుగు’ పత్రిక ప్రచురించిన కథనాలతో రాష్ట్ర సర్కార్ దిగివచ్చింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ డిజైన్‌లో కీలక మార్పులు చేసింది. మొదటి పంపుహౌస్‌లో వర్క్ ఏజెన్సీకి లాభం చేసేందుకు తొలగించిన స్టాండ్ బై పంపును తిరిగి ఏర్పాటు చేసేందుకూ ఓకే చెప్పింది. అలాగే ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకుంది.
వర్క్ ఏజెన్సీ ఒత్తిడితో..
పాలమూరు లిఫ్ట్ లో మొదటి పంపుహౌస్ ‘ఎల్లూరు’ను మొదట ఓపెన్ కట్‌గా ప్రతిపాదించారు. వర్క్ ఏజెన్సీ ఒత్తిడితో తర్వాత దానిని అండర్ గ్రౌండ్‌గా మార్చారు. పంపుహౌస్‌ను అండర్ గ్రౌండ్‌కు మార్చే క్రమంలో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ చానల్ డిజైన్‌లో మార్పు చేశారు. శ్రీశైలం నుంచి 800 అడుగుల లెవల్ నుంచే నీటిని తీసుకోవాల్సి ఉండగా, దానిని 821 అడుగుల లెవల్ కు పెంచారు. పంపుహౌస్‌లో 145 మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిది మోటార్లతో రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయాల్సి ఉంటుంది. కృష్ణాలో ఫ్లడ్ డేస్ తగ్గిపోయాయి కాబట్టి ఏదైనా మోటారులో సాంకేతిక సమస్యలు వస్తే ఎత్తిపోతలకు ప్రాబ్లమ్ రాకుండా పంపుహౌస్‌లో స్టాండ్ బై మోటారు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రాజెక్టులో రెండు, మూడో లిఫ్టులైన ఏదుల, కర్వెన పంపుహౌస్‌ల్లోనూ 145 మెగావాట్ల సామర్థ్యమున్న 9 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏదుల, కర్వెనలో తొమ్మిదేసి మోటార్లు ఉంచి, ఎల్లూరు పంపుహౌస్‌లో మాత్రం తొమ్మిదో మోటారును తొలగించారు. స్టాండ్ బై మోటారు ఏర్పాటు చేస్తే వర్క్ ఏజెన్సీపై భారం పడుతుందనే కారణంతోనే ప్రభుత్వం దానిని తొలగించేందుకు గతంలో ఓకే చెప్పింది.
మార్పులపై రైతుల నిరసనలు
కృష్ణాలో ఫ్లడ్ డేస్ 60 నుంచి 30 రోజులకు పడిపోయినా శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేలా మార్పు చేయలేదు. 800 అడుగుల నుంచి తీసుకోవాల్సిన నీటిని ఏకపక్షంగా 821 అడుగులకు పెంచారు. దీంతో శ్రీశైలం నుంచి వరద నీళ్లు తీసుకునే రోజులు తగ్గిపోతాయని ‘వెలుగు’ హెచ్చరించింది. స్టాండ్ బై మోటారు తొలగింపు కూడా సరికాదని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని పలు సందర్భాల్లో ప్రముఖంగా ప్రచురించింది. దీనిపై ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి రైతుల నుంచి నిరసన ఎదురుకావడంతో సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ చానల్, పంపుహౌస్‌లో కీలక మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు డిజైన్‌లో మార్పులకు ఆమోదం తెలుపాలని సీఈ, సీడీవోను ఆదేశించింది.
పనుల పూర్తికి టార్గెట్లు
ఎల్లూరు పంపుహౌస్‌లో ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి రెండు మోటార్లు ఏర్పాటు చేసి కనీసం అర టీఎంసీ నీళ్లను ఎత్తిపోయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈమేరకు వర్క్ ఏజెన్సీ అవసరమైన మెషనరీ రెడీ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పంపుహౌస్‌లో తొమ్మిది పంపులు, మోటార్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సివిల్ వర్క్స్ ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. మొత్తం తొమ్మిది మోటార్లకు డ్రాఫ్ట్ ట్యూబ్‌లు, డెలివరీ సిస్టర్న్‌లు నిర్మించనున్నారు. పంపుహౌస్ నిర్మాణానికి అవసరమైన 128 ఎకరాలు, సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన 42 ఎకరాల భూమిని వెంటనే ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు బదలాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం కీలక మార్పులకు ఓకే చెప్పడంతో ఎల్లూరు పంపుహౌస్‌లో తొమ్మిది మోటార్ల ఏర్పాటుకు సివిల్ పనులు ప్రారంభించారు. హెడ్ రెగ్యులేటర్, ఇన్‌టేక్ స్ట్రక్చర్స్, అప్రోచ్ చానల్ పనుల్లోనూ ఈమేరకు మార్పులు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
