ఓట్ చోరీ వల్లే దేశంలో అవినీతి, నిరుద్యోగం పెరుగుతున్నయి: రాహుల్ గాంధీ

 ఓట్ చోరీ వల్లే దేశంలో అవినీతి, నిరుద్యోగం పెరుగుతున్నయి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగానికి.. ఓట్​చోరీతో సంబంధం ఉందని లోక్​ సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, ఉపాధి కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, ఓట్ల దొంగతనం ద్వారా అధికారంలో ఉంటున్నదని ఆరోపించారు. ఉద్యోగాల కోసం నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న.. మరోవైపు ప్రధాని మోదీ నెమళ్లకు గింజలు, ఆహారం పెట్టడం, యోగా చేస్తున్న దృశ్యాలను పక్కపక్కనే చూపిస్తూన్న ఒక వీడియోను రాహుల్​గాంధీ మంగళవారం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో పోస్ట్ చేశారు.

ఈ ప్రభుత్వం యువత సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ.. తన ఇమేజ్‌‌‌‌‌‌‌‌బిల్డప్​చేసుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆయన విమర్శించారు. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్లలో అత్యంత గరిష్ఠ స్థాయికి చేరిందని, జాబ్​రిక్రూట్​మెంట్లు కొలాప్స్​అయ్యాయని, పరీక్షల పేపర్లు లీక్ అవుతున్నాయని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. కష్టపడి చదువుకుంటున్న యువత కలలను ఈ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపు సరైనది కాదని.. ఓట్ల దొంగతనం, వ్యవస్థలను చేతిలో పెట్టుకుని అధికారంలో కొనసాగుతున్నదని ఆరోపించారు. 

ఈ ఓటు చోరీ కారణంగానే దేశంలో నిరుద్యోగం, అవినీతి పెరుగుతున్నాయని వివరించారు. మోదీ తన సొంత ప్రచారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి, సెలబ్రిటీలతో పొగిడించుకుంటూ..  దేశంలోని కొద్ది మంది సంపన్నుల లాభాల కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. దేశంలోని యువత ఇక ‘జాబ్​చోరీ’, ‘ఓట్​చోరీ’ని సహించబోదన్నారు. నిరుద్యోగం, ఓటు చోరీ నుంచి దేశాన్ని విముక్తి చేయడమే నిజమైన దేశభక్తి అని అన్నారు. త్వరలో ఓటు దొంగతనంపై మరిన్ని బలమైన ఆధారాలను బయటపెడతానని వివరించారు.