ధరల పెరుగుదలపై ప్రధాని మోడీకి చిన్నారి లేఖ

 ధరల పెరుగుదలపై  ప్రధాని మోడీకి చిన్నారి లేఖ

దేశంలో ధరల పెరుగుదలపై ప్రధాని మోడీకి ఆరేళ్ల చిన్నారి లేఖ రాసింది. కనీసం పెన్సిల్, రబ్బర్ కొందామన్నా కొనలేకపోతున్నానని వాపోయింది. ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లా చిబ్రమావుకు చెందిన కీర్తి దూబే అనే ఆరేళ్ల చిన్నారి ఒకటో తరగతి చదువుతోంది. తాను ఇప్పటివరకూ చాలా సార్లు పెన్సిల్ పొగొట్టుకున్నా కోప్పడని తల్లి.. ఈ సారి మాత్రం తనకు చివాట్లు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. దానికి కారణం పెన్సిల్ ధర పెంచడమేనని చెప్పుకొచ్చింది. దాంతో పాటు రబ్బర్, మ్యాగీ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి ఈ విధంగా లేఖ రాసింది.

"నా పేరు కృతి దూబే. నేను ఒకటో తరగతి చదువుతున్నాను. మోదీ గారూ మీరు నా పెన్సిల్, రబ్బరు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమయ్యారు. మ్యాగీ ధర కూడా పెరిగింది. ఇప్పుడు మా అమ్మ నన్ను పెన్సిల్ అడిగినందుకు కొట్టింది. ఇప్పుడు నేనేం చేయాలి? వేరే పిల్లలు నా పెన్సిల్‌ని దొంగిలించారు."

-   కీర్తి దూబే

ఇక ఈ చిన్నారి తండ్రి విశాల్ దూబే "ఇది నా చిన్నారి కూతురు మన్ కీ బాత్ (మనసులో మాట)" అంటూ ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది.