
- క్వింటాలు పత్తి రూ. 5 వేలు, మక్క రూ. 1,600 ధర
- కొర్రీలు పెట్టి రైతుల నుంచి కొంటున్న వ్యాపారులు
- సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయక పత్తి కొనడం లేదు
- మార్కెట్ లో ఇష్టానుసారంగా దళారుల దందా
- పెట్టుబడి ఖర్చులు రావట్లేదని రైతుల ఆవేదన
వరంగల్, వెలుగు : ఏనుమాముల మార్కెట్ లో పత్తి, మక్క రైతులకు సరైన ధర రాక దు:ఖం మిగులు తోంది. ఈసారి వర్షాల కారణంగా పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దీంతో పత్తి, మక్కకు భారీగా డిమాండ్ ఉంటుందని రైతులు పంటను మార్కెట్ తీసుకొస్తున్నారు. వ్యాపారులు ఫిక్స్ చేస్తున్న ధరలతో రైతులకు పెట్టుబడి ఖర్చులకు కూడా రావడంలేదు. కనీస మద్దతు ధర కల్పించాల్సిన మార్కెట్ అధికారి నిర్లక్ష్యంగా ఉండడంతో రైతులు దిగులుతో ఇంటిబాట పడుతున్నారు.
ఈసారి తగ్గిన దిగుబడి
ఏటా పత్తి పంట ఎకరానికి దాదాపు 10 –12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈసారి అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. పంటకు తెగులు సోకి దిగుబడి సగానికి తగ్గిపోయింది. ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే చేతికొచ్చింది. మక్కల పరిస్థితి అంతే. గతంలో ఎకరానికి 25 – 30 క్వింటాళ్ల దిగుబడి రాగా, ప్రస్తుతం 15 క్వింటాళ్లలోపే వస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
మద్దతు ధరపై అధికారుల నిర్లక్ష్యం
ఏనుమాముల మార్కెట్ కు రైతులు పంటను తీసుకొస్తుండగా ప్రభుత్వ కనీస మద్దతు ధరల ఉత్తమాటే అవుతోంది. ఈసారి సీజన్ మొదట్లో రోజుకు 30 -–40 వేల బస్తాలు మార్కెట్ యార్డుకు వచ్చాయి. ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.8,110, మక్క క్వింటాలు రూ.2,400 ధరగా నిర్ణయించింది. మద్దతు ధర అమలులో అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పత్తికి రూ.5 వేల నుంచి రూ.5, 500 వరకు పెంచి ఇస్తున్నారు. మక్క క్వింటాలు రూ.2,400 కనీస మద్దతు ధరగా ఉంటే.. రూ.1,600 –1,800 మధ్యనే చెల్లిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‍గా మారి రైతులను దోచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
వ్యాపారుల ఇష్టారాజ్యం
రైతులు పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్ కు వస్తుండగా.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదనుగా వ్యాపారులు రైతులను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని పలువురు మండిపడుతున్నారు. పత్తి మద్దతు ధర రూ.8,110 ఉంటే, తేమ, రంగు, నాణ్యత అంటూ కొర్రీలు పెడుతూ ఒక్కో క్వింటాల్‍పై రూ.3 వేలు తగ్గించి కొనుకోలు చేస్తున్నారు.
మక్కలకు మద్దతు ధర రూ.2,400 ఉంటే, క్వింటాల్‍పై రూ.600 – రూ.800 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ నిర్వహణకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. గతంలో ఇక్కడ పని చేసిన మార్కెట్ సెక్రటరీపై అవినీతి ఆరోపణలు రావడంతో బాధ్యతల నుంచి తప్పించారు.
నర్సంపేట మార్కెట్ కార్యదర్శికి ఇన్ చార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. అతను కూడా సెలవులో ఉండడంతో గ్రేడ్ –2 కార్యదర్శికి బాధ్యతలు ఇచ్చారు. ఆఫీసర్లు, వ్యాపారులు సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో దళారుల చేతుల్లోనే రైతులు మోసపోతున్నారని పేర్కొంటున్నారు.
వచ్చే పైసలు కూలీలకే చాలవు
ఈ ఏడాది ఎకరానికి పత్తి 4–5 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. రెండేండ్ల కిందట ఇట్లనే అయితే డిమాండ్ ఉంది. ఇప్పుడు అట్లనే ఉంటుందని వస్తే.. క్వింటాల్‍కు రూ.4,500 నుంచి రూ.5వేలలోపే ధర పెట్టి కొంటున్నారు. వచ్చే పైసలు కూలీలు, పురుగు మందులు, రవాణా ఖర్చులకు కూడా సరిపోవు.
- రాజయ్య, రైతు-
మద్దతు ధర ఉత్తదే..
పత్తికి ప్రభుత్వం క్వింటాల్ రూ.8,110 మద్దతు ధర ప్రకటిస్తే.. ఏనుమాముల మార్కెట్లో వ్యాపారులు ఒక్కటై రూ.4–5 వేల మధ్యనే కొంటున్నారు. అధికారులు దళారుల దందాను అడ్డుకోవాలి. పత్తి మాయిశ్చర్ శాతం పెంచాలే.
- ఓదెలు, రైతు, శ్రీనివాస్ (తెలంగాణ రైతు సంఘం నేత)
మక్కలు ఆరబెట్టినా రేటు పెంచట్లేదు
ఎకరానికి 30 క్వింటాళ్లు రావాల్సిన మక్కల పంట ఈ ఏడాది 15 క్వింటాళ్లలోపే వచ్చింది. పంటను అమ్ముకునేందుకు మార్కెట్ వస్తే మాయిశ్చర్ పేరుతో తక్కువ ధర చెప్పారు. వారు చెప్పినట్లు రెండు రోజులు ఇక్కడే ఉండి మక్కలు ఆరబెట్టినా ధర మాత్రం పెంచట్లేదు.
-సురేష్, బాబు, రైతులు-