
- గ్రామాల్లోనే వ్యాపారుల కొనుగోళ్లు
- క్వింటాలుకు అత్యధికంగా రూ. 5500 మాత్రమే..
సిద్దిపేట, వెలుగు: ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని క్వింటాలుకు రూ.5500 మించి ఇవ్వడంలేదు. జిల్లాలోని హుస్నాబాద్, బెజ్జంకి, కోహెడ, చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట, జగదేవ్ పూర్, సిద్దిపేట, నంగునూరు, కొమురవెల్లి, అక్కన్నపేట మండలాల్లో పత్తి సాగు ఎక్కువగా జరుగుతోంది. జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై జాప్యం జరుగుతుండడంతో గ్రామాలకు వచ్చిన ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. జిల్లాలో ఈ సీజన్ లో 1.07 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా పది లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
పరిస్థితి తారుమారు
జిల్లాలో వానాకాలం సీజన్ లో భిన్న వాతావరణం ఏర్పడడంతో పత్తి దిగుబడి బాగా పడిపోయింది. సీజన్ మొదట్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి తర్వాత అధిక వర్షాలు పత్తి సాగుపై ప్రభావం చూపాయి. సకాలంలో వర్షాలు కురియకపోవడంతో ఎదుగుదల లోపించగా అష్ట కష్టాలు పడి పంటను కాపాడుకుంటే తర్వాత అధిక వర్షాలు దెబ్బతీశాయి. పత్తి రంగు మారి 20 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి తగ్గింది.
సీసీఐ కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు
సిద్దిపేట జిల్లాలోని తొమ్మిది ఏఎంసీల పరిధిలో 23 జిన్నింగ్ మిల్లులుండగా వాటిలో సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త నిబంధనల వల్ల టెండర్లలో జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పాల్గొనకపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నాలుగు రోజుల కింద టెండర్ల ప్రక్రియను ముగించినా కేంద్రాల ఏర్పాటుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. మొదటి విడతలో జిల్లాలోని 10 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
వ్యాపారుల ప్రవేశంతో తగ్గిన ధరలు
జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు గ్రామాల్లోకి వెల్లి పత్తిని కొనుగోలు చేస్తుండడంతో ధరలపై ప్రభావం చూపుతోంది. వాతావరణ పరిస్థితుల వల్ల పత్తి రంగు మారడంతో తక్కువ ధరకే వ్యాపారులు పంటను కొనుగోలు చేస్తున్నారు. అత్యధికంగా రూ.5500 మాత్రమే చెల్లిస్తుండటంతో రైతులు క్వింటాలుకు రూ. 2500 నుంచి రూ3 వేల వరకు నష్టపొతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు ఏకంగా గ్రామాల్లోని రైతుల ఇండ్ల వద్దనే కాంటాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుండగా చేర్యాల పట్టణంలో షాపుల ముందే తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. కోహెడ మండలంలోతక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తుంటే ఏఎంసీ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు.
సీసీఐ కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నం
ఐదెకరల్లో పత్తిని సాగుచేస్తే వాతావరణ పరిస్థితుల కారణంగా కేవలం ఇరవై క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అధిక వర్షాల వల్ల పత్తి తడిసిపోవడంతో తక్కువ ధరకే కొంటామని ప్రైవేట్ వ్యాపారులు చెబుతున్నారు. సీసీఐ కేంద్రంలో అమ్మడం కోసం తడిసిన పత్తిని ఎండబెట్టుకుని ఎదురు చూస్తున్నా. అధికారులు వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పత్తి రైతులు నష్టపోకుండా చూడాలి. - నక్క రాజు, రైతు, తీగలకుంట పల్లి
త్వరలో సీసీఐ కేంద్రాల ఏర్పాటు
కొద్ది రోజుల్లో జిల్లాలో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నోటిఫై చేసిన మిల్లుల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదేశాలు రాగానే కొనుగోళ్లను ప్రారంభిస్తాం. జిన్నింగ్ మిల్లులు టెండర్ల విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడడంతో కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం జరిగింది. సీసీఐ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల ప్రకారం రైతులకు మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు తొందరపడి పత్తిని అమ్ముకోవద్దు.- నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారి