- రూ.500 పలుకుతున్న కూలి ధర.. అయినా స్థానికంగా కొరత
- ఏపీ, కర్నాటక ప్రాంతం నుంచి కూలీలకు రప్పిస్తున్న రైతులు
- అదనంగా రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు
మహబూబ్నగర్, వెలుగు : పత్తి రైతులు కూలీల కొరత వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పత్తిని ఏరడానికి కూలీలు దొరక్క, ఖర్చుల భారం పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నారు. వానాకాలంలో పత్తి సాగు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏదో ఒక రకంగా రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.
గత వారం వరకు కురిసిన వానలు చేలను నాశనం చేయగా, ఇప్పుడు పత్తి ఏరేందుకు కూలీల కొరత ఏర్పడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉన్న కొందరు కూలీలు.. కూలి ధరను అమాంతం పెంచారు. ఆ ధర చెల్లిస్తామని రైతులు చెబుతున్నా అవసరం మేరకు కూలీలు లేకపోవడంతో కర్నాటక, ఏపీ రాష్ర్టాల నుంచి పిలిపించుకుంటున్నారు.
కూలీల కోసం రైతుల మధ్య పోటాపోటీ..
పత్తి దిగుబడులు ప్రారంభమయ్యాయి. కానీ వానలు వెంటాడుతుండడంతో త్వరగా పత్తిని ఏరాలని రైతులు కూలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైతు మాట్లాడుకున్న కూలీలను.. మరో రైతు తీసుకెళ్లిపోతున్నాడు. దీంతో రైతుల మధ్యే కూలీల కోసం పోటాపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కూలీ కోసం ఓ రైతు మాట్లాడుకున్న కూలీలకు చెల్లించే ధరకంటే అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి మరో రైతు వారిని తీసుకెళ్లిపోతున్నాడు. పత్తి ఏరేందుకు బాగా డిమాండ్ ఏర్పడడంతో ఇదే అదునుగా కూలీలు కూడా కూలి ధరను పెంచారు. నిరుడు ఒక వ్యక్తి పత్తి ఏరడానికి రోజుకు రూ.300 వరకు కూలీ ఉండేది.
అయితే ఈ ఏడాది ఏకంగా రూ.200 పెంచి రూ.500 తీసుకుంటున్నారు. ఈ మొత్తం ఇచ్చినా.. కొన్ని గ్రామాల్లో కూలీలు దొరకని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో రైతులు పక్క మండలాల రైతులను పిలిపించుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పిస్తున్నారు. 15 మంది కలిసి వస్తే ఆటోకు అప్అండ్డౌన్ కింద రూ.2,500.. 25 మందితో వస్తే బొలెరో వాహనానికి రాను పోను చార్జీల కింద రూ.4 వేలు చెల్లిస్తున్నారు.
ఏపీ, కర్నాటక నుంచి వస్తున్న పత్తి కూలీలు..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు కర్నాటక రాష్ర్టంలోని మినేశ్పూర్, అన్పూర్, కొంకల్, గుర్మిట్కల్, కర్నె, నందెపల్లి, జేగ్రం, ఇడ్లూరు, హజీలాపురం, సేలేరు, ఏపీలోని మంత్రాలయం, ఆదోని ప్రాంతాల నుంచి పత్తి కూలీలు వస్తున్నారు. ఇందులో మంత్రాలయం, ఆదోని ప్రాంతాల నుంచి వస్తున్న కూలీలకు రైతులు తాత్కాలిక వసతి కల్పిస్తున్నారు. అయితే పొరుగు రాష్ర్టాల నుంచి వస్తున్న కూలీల్లో కొందరు రోజువారి కూలీ డబ్బులు తీసుకోవడం లేదు.
కిలో పత్తి ఏరితే రూ.12 నుంచి రూ.15 వరకు డబ్బులు తీసుకుంటున్నారు. ఈ లెక్క ప్రకారం ఒక రోజుకు ఒకరు క్వింటాల్పత్తిని ఏరి దాదాపు రూ.1,500 తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. మరికొందరు కూలీలు పత్తి ఏరే ప్రాంతం దగ్గర్లో ఉంటే రోజుకు ఒక వ్యక్తి రూ.600 కూలీ మాట్లాడుకుంటున్నారు. రవాణా చార్జీలను రైతులతోనే పెట్టిస్తున్నారు.
భయపెడుతున్న వానలు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి దిగుబడులు మొదలయ్యాయి. అయితే రైతులను వర్షాల భయం వెంటాడుతోంది. పత్తి చేలకు పూత, కాయ పడుతున్న దశల్లో వర్షాలు పడటంతో పంట నష్టం జరిగింది. కొద్దో, గొప్పో దిగుబడి వచ్చినా.. గత వారం కురిసిన వర్షానికి తడిసిపోయింది. ఉన్న పంటను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా పత్తి ఏరి సీసీఐ కొనుగోలు సెంటర్లు లేదా ఇండ్లలో స్టాక్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
రూ.400 తోపాటు రవాణా చార్జీలు ఇస్తున్నా..
నాకున్న ఏడెకరాల పొలంలో పత్తి సాగు చేశా. ఎకరాకు రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. కానీ వర్షాలతో పంట మొత్తం దెబ్బతిన్నది. ఎకరాకు రూ.30 వేలు వస్తే గొప్ప విషయం. దీనికి తోడు పత్తి ఏరడానికి కూలీలు వస్తలేరు. మా గ్రామానికి దగ్గరలో ఉన్న కర్నాటక రాష్ర్టానికి చెందిన కూలీలను పిలిపించా. ఒక్కొక్కరికీ రూ.400 కూలీతోపాటు రవాణా చార్జీలు కూడా చెల్లిస్తున్నా.- కుర్వ పాపన్న, పత్తి రైతు, ఊట్కూరు
పక్క మండలం కూలీలను పిలిపించా..
గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి కూలీలకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో కూలి ధర కూడా పెంచారు. నాకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి వేశా. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. పత్తి ఏరాల్సి ఉండగా.. స్థానికంగా కూలీలు దొరకలేదు. దీంతో కోయిల్కొండ మండలానికి చెందిన కూలీలను మాట్లాడుకున్నా. ఒక్కొక్కరికీ రూ.400 చెల్లించడంతోపాటు రాను, పోను ఆటోచార్జీలు ఇస్తున్నా.- హన్మంతు, పత్తి రైతు, పల్లెగడ్డ గ్రామం, మరికల్ మండలం
