పత్తి కాంటాలు షురూ.. రెండు రోజుల బంద్ తర్వాత బుధవారం నుంచి కొనుగోళ్లు

పత్తి కాంటాలు షురూ.. రెండు రోజుల బంద్ తర్వాత బుధవారం నుంచి కొనుగోళ్లు

వరంగల్  సిటీ/ఆదిలాబాద్, వెలుగు: జిన్నింగ్​ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రెండు రోజులుగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు బుధవారం పున: ప్రారంభమయ్యాయి. జిన్నింగ్  వ్యాపారులు, సీసీఐ అధికారులతో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు జరిపిన చర్చలు సఫలం కావడంతో పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 

దీంతో రైతులు స్లాట్  బుక్  చేసుకొని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చారు. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు పత్తి బండ్లు, వెహికల్స్​ భారీగా వచ్చాయి. వరంగల్. ఆదిలాబాద్  వ్యవసాయ మార్కెట్ తో పాటు సీసీఐ, ప్రైవేట్  వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ఏనుమాముల మార్కెట్లో..
వరంగల్​ ఏనుమాముల మార్కెట్​కు 2 వేల బస్తాల పత్తి రాగా, మరో 80 వెహికల్స్​లో రైతులు పత్తి తీసుకువచ్చారు. మద్దతు ధర రూ.8110 ఉండగా, తేమ శాతం ఎక్కువగా ఉండటంతో రూ.5 వేల నుంచి రూ.6,830 చెల్లించారు. మద్దతు ధర ఎవరికీ లభించలేదు. శుక్రవారం వరకు పత్తి కొనుగోళ్లు, అమ్మకాలతో బిజీగా ఉన్న మార్కెట్​లో శని, ఆది, సోమ, మంగళవారాల్లో పత్తి కొనుగోళ్లు జరగలేదు. 

ఆదిలాబాద్​లో కొనుగోళ్లు అంతంతే..
ఆదిలాబాద్​ జిల్లాలో ఈ ఏడాది 4.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 1.03 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. సీసీఐ 76 వేల క్వింటాళ్లు, ప్రైవేట్  వ్యాపారులు 27 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. సీసీఐ క్వింటాల్​కు గరిష్టంగా రూ. 8,110, కనిష్టంగా రూ. 7.780 వరకు చెల్లించింది. ప్రైవేట్ లో రూ.6,660 ధర పలుకుతోంది. ఆదిలాబాద్​ జిల్లాలో 34 జిన్నింగ్  మిల్లులు ఉండగా, ఇప్పటి వరకు 22 మిల్లులు స్టార్ట్​ అయ్యాయి.