అక్టోబర్ 22 నుంచే పత్తి కొనుగోళ్లు..రూ. 8,110, రూ. 8,060 మద్దతు ధరలతో కొనుగోళ్లు

అక్టోబర్ 22  నుంచే పత్తి కొనుగోళ్లు..రూ. 8,110,  రూ. 8,060 మద్దతు ధరలతో కొనుగోళ్లు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన  సీసీఐ, మార్కెటింగ్​ శాఖ
  • పలు జిల్లాల్లో జోరుగా పత్తి తీస్తున్న రైతాంగం
  • ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో సాగు
  • 28 లక్షల టన్నుల దిగుబడి అంచనాలతో ఏర్పాట్లు
  • రూ. 8,110,  రూ. 8,060 మద్దతు ధరలతో కొనుగోళ్లు 
  • రైతుల మొబైల్​ నంబర్​ అప్‌‌డేషన్‌‌కు ఏఈవోల సహకారం
  • సమస్యలపై ప్రత్యేక టోల్​ఫ్రీ నంబర్​ 1800-599-5779 


హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.  ఇందుకు  ప్రభుత్వం, కాటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్​ఆఫ్​ ఇండియా (సీసీఐ)  ఏర్పాట్లు పూర్తిచేశాయి. రాష్ట్ర మార్కెటింగ్​శాఖ, అగ్రికల్చర్​ శాఖల సమన్వయంతో కాటన్​సేకరణ జరుగనున్నది. ఈ వానాకాలంలో 45.32 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేయగా.. 28.29 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ‘కపాస్ కిసాన్’ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులే పత్తి విక్రయించేలా సీసీఐ, మార్కెటింగ్​ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.  రాష్ట్రవ్యాప్తంగా పత్తి సాగయ్యే ప్రధాన జిల్లాల్లో రైతాంగం జోరుగా పత్తి తీస్తున్నది.  జాబ్ వర్క్ టెండర్లలో జిన్నింగ్ మిల్లర్లు తొలుత పాల్గొనకపోవడంతో ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..సీసీఐ, మార్కెటింగ్​, అగ్రికల్చర్​ అధికారులతో చర్చలు జరిపారు. సమస్యను వెంటనే పరిష్కరించారు.  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టెండర్లలో 321 జిన్నింగ్​ మిల్లులు పాల్గొని, అర్హత సాధించాయి. దీంతో ఈ జిన్నింగ్ మిల్లుల్లో  పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. 

‘కపాస్ కిసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’​యాప్​ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేషన్​

‘కిసాన్​కపాస్’ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులు తమ మొబైల్ నంబర్లను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేసుకోవడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు తమ పరిధి ఏఈవోల సహకారం అందిస్తారు. పాత జిల్లాల పరిధిలో ఎక్కడైనా రైతులు తమ పత్తిని విక్రయించేందుకు సీసీఐ అనుమతి ఇచ్చింది.  రైతులు  మార్కెటింగ్ శాఖ టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్ 1800-599-5779 ద్వారా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రతి ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ, సహకార శాఖలోని డైరెక్టర్, ఎండీ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించింది.  జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దిగుమతి సుంకాల మినహాయింపుతో  ఇబ్బందులు

కేంద్ర సర్కారు పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించడంతో రైతాంగం, జిన్నింగ్​ మిల్లుల్లో ఆందోళన వ్యక్తమైంది.  గతంలో ఉన్న మద్దతు ధర కంటే ఈ సారి ఎక్కువ ధర పలుకగా.. సుంకాల మినహాయింపుతో మార్కెట్లో పత్తి ధరలు పడిపోయాయి. అధిక వర్షాలు, తెగుళ్ల ప్రభావంతో పంట దిగుబడిపై ప్రభావం చూపగా, ప్రభుత్వం మద్దతు ధర రూ.8,110, రూ.8,060 తో కొనుగోళ్లు చేపట్టడానికి  సిద్దమవడంతో రాష్ట్ర రైతాంగానికి కొంత ఉపశమనం కలిగింది.